పెదకాకాని: ఆడిట్ విభాగానికి బూసిరెడ్డి చిన్నపరెడ్డి తన పనితీరుతో నూతన జవసత్వాలు తెచ్చారని రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ డాక్టర్ ఈదర కల్యాణి ప్రశంసించారు. ఆడిట్ సిబ్బందిని ఆయన విజ్ఞానాధారిత సమూహంగా మలిచారని కొనియాడారు. విజయవాడ నగరపాలక సంస్థలో జాయింట్ డైరెక్టర్ (అమృత్)గా పనిచేస్తున్న చిన్నపరెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆడిట్ విభాగంలో దాదాపు మూడు దశాబ్దాలుగా చిన్నపరెడ్డి అందించిన సేవలకు గుర్తుగా ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఉద్యోగ విరమణ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన కల్యాణి మాట్లాడుతూ యువతరంతో పోటీపడుతూ సాంకేతికతను అందిపుచ్చుకున్న చిన్నపరెడ్డి తాను కొవ్వొత్తిలా కరుగుతూ డిపార్ట్‌మెంట్‌కు వెలుగులు పంచారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆడిట్ శాఖలో నెలకొన్న పలు దీర్ఘకాలిక సమస్యలను చిన్నపరెడ్డి ఎంతో ఓర్పు, నేర్పుతో పరిష్కరించారని, సిబ్బందిపై ప్రేమాభిమానాలు ప్రదర్శించారని తెలంగాణ ఆడిట్ శాఖ మాజీ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. చిన్నపరెడ్డి వ్యక్తిగతంగానూ పరిపూర్ణుడని, జీవితంలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలంగాణ ఆడిట్ విభాగ మాజీ ప్రాంతీయ ఉప సంచాలకుడు చకిలం వేణుగోపాల్ చెప్పారు. వర్క్స్ ఆడిట్ అంశంలో చిన్నపరెడ్డి విశేష కృషి చేశారని ఆడిట్ విభాగం మాజీ అదనపు సంచాలకుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బూసిరెడ్డి చిన్నపరెడ్డి మాట్లాడుతూ తోటి సిబ్బంది అందించిన సహాయ సహకారాల వల్లనే తాను ఉద్యోగ జీవితంలో విజయాలు సాధించడం సాధ్యపడిందన్నారు. ఈ స్థాయిలో ఉద్యోగ విరమణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ మాజీ డైరెక్టర్ పార్థసారథి, ప్రాంతీయ ఉప సంచాలకులు కె నాగశ్రీనివాస్, సీతారామారావు, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆర్థిక అధికారి కేవీ సుబ్బారావు, ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డి, గుంటూరు నగరపాలక సంస్థ మాజీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ నాగేంద్రకుమార్, జిల్లాల ఆడిట్ అధికారులు ఎస్.శ్రీకాంత్, పద్మజ, తిరుపతయ్య, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ డాక్టర్ ఈదర కల్యాణి


