నరసరావుపేట టౌన్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రాజమోహన్‌రావు ఆదివారం తెలిపారు. సాతులూరు నుంచి నరసరావుపేటకు వచ్చే రైలు మార్గంలో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుడికి సుమారు 25 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు తెలుపు రంగు టీ షర్ట్ మరియు లైట్ బ్లూ కలర్ నిక్కర్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ మార్చిరీ రూంలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు నరసరావుపేట రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లింగాయపాలెం టయోటా షోరూమ్ సమీపంలోగల ప్లాట్లలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని సమాచారం మేరకు ఆదివారం నల్లపాడు పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆధారాలను బట్టి ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. పొలాల్లో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 60 నుంచి 70 సంవత్సరాల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగు డిజైన్ చొక్కా, నీలం రంగు గడుల (చెక్స్) లుంగీ ధరించి ఉన్నాడు. నోటి వెంట నురగ రావడంతో పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా సంబంధీకులు ఎవరైనా ఉంటే నల్లపాడు పోలీసులను సంప్రదించాలని కోరారు.
పట్నంబజారు: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి కేసులో బాలిక మృతదేహానికి పోలీసులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. శనివారం పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోని అల్లీనగర్ ప్రాంతంలో పదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. ఈ క్రమంలో చిన్నారి తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పూరిస్థాయిలో పంచనామా, వాంగ్మూలాలు తీసుకున్నారు. ఆ చిన్నారి తల్లి పలు ప్రాంతాల్లో నివాసం ఉన్న నేపధ్యంలో ఆయా ప్రాంతాలన్నింటి వద్ద నివాసాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మృతిపై వస్తున్న అనుమానాల నేపధ్యంలో వైద్య నిపుణుల చేత పరీక్షలు చేయించినట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు తెలిపారు. చిన్నారిపై ఏదైనా లైంగికదాడి జరిగిందా..? లేకుంటే ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా..? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు.


