సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి

Aug 31 2026 1:44 AM | Updated on Aug 31 2026 1:44 AM

మంగళగిరి టౌన్‌: మంగళగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించి, నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్‌, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని వివిధ సంఘాల నాయకులు హాస్టల్‌ను ఆదివారం సందర్శించారు. పలువురు నాయకులు విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, హాస్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్‌లో ప్రస్తుతం 16 మంది విద్యార్థులు ఉన్నారని, సొంత భవనం ఉన్నప్పటికీ కనీస వసతులు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్‌రూమ్‌లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్‌ఓ ప్లాంట్‌ లేకపోవడంతో మున్సిపల్‌ కుళాయి నీటినే తాగాల్సి వస్తోందని, ఒక్కోసారి నీరు ఎర్రగా వస్తోందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. దోమలు విపరీతంగా ఉన్నాయని దోమల నివారణ కోసం రెండు నెలల క్రితం మిషన్లు అందించినప్పటికీ ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్‌ చార్జీలు చెల్లించలేదని, క్రీడా సామగ్రి కూడా అందుబాటులో లేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ మంగళగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌ను స్వయంగా సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి లోకనాధం, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, జిల్లా అధ్యక్షుడు ఏనుగుల కమలాకర్‌, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎ.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement