ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి
తెనాలిటౌన్: బీసీల ఇళ్లకు కూడా ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. తెనాలిలోని విద్యుత్ ఆపరేషన్ డివిజన్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్సీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తుచేశారు. ఇందులో భాగంగా తెనాలి డివిజన్‌కు 9 వేల యూనిట్లు మంజూరు కాగా, మెటీరియల్ కొరత కారణంగా 1,500 మాత్రమే పూర్తి చేయగలిగినట్టు తెలిపారు. బీసీలకు కూడా పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలను సబ్సిడీగా సమకూరుస్తుందని చెప్పారు.
మూడు నెలల్లోనే సాగు కనెక్షన్లు
వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టు వివరించారు. తెనాలి డివిజన్ పరిధిలో శేకూరు, పట్టణ కొత్తపేటలో రెండు నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరైనట్లు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు ఇచ్చిన మూడు నెలల్లోనే మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి కాలం మాదిరిగానే విద్యుత్ వినియోగం ఉందని అన్నారు. ఓవర్‌లోడ్ ప్రాంతాలను గుర్తించి ట్రాన్స్‌ఫార్మర్‌లను మార్చుతున్నట్లు తెలిపారు. సంవత్సరం క్రితం వ్యవసాయ కనెక్షన్లు 150 పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 285 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. రైతులకు పగలు 9 గంటల కరెంటు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని వెల్లడించారు. సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణయాదవ్, గుంటూరు జిల్లా ఎస్‌ఈ చల్లా రమేష్, తెనాలి డివిజన్ ఈఈ అక్కల సత్యనారాయణ, డీఈఈ బోరుగడ్డ అశోక్‌కుమార్, టి.విశ్వనాథం, ఏఈలు బి.సుధీర్, దుర్గారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


