తొలి దశలోనే ‘పేట’ పుర ఎన్నికలు? | - | Sakshi
Sakshi News home page

తొలి దశలోనే ‘పేట’ పుర ఎన్నికలు?

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

అధికారులకు సూచనలిచ్చిన ఉన్నతాధికారులు వచ్చే నెలలో కోర్టు కేసుల పరిష్కారానికి అవకాశం

నరసరావుపేట: సుమారు వందేళ్లకుపైగా చరిత్ర కలిగి, 1.40 లక్షల జనాభా ఉన్న నరసరావుపేట పురపాలక సంఘానికి మొదటి దశలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, సీడీఎంఏ, రాష్ట్ర సచివాలయ ప్రధాన కార్యదర్శి శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు అధికారులను సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కొన్నిరోజులుగా ఎన్నికలకు అవరోధంగా మారిన కోర్టు కేసుల పరిష్కారానికి అధికారులు, టీడీపీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మొత్తం తొమ్మిది కేసుల్లో ఆరింటిని పిటిషనర్లు ఉపసంహరించుకునేలా చేశారు. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో కోర్టులో విచారణకు వచ్చే మిగిలిన కేసులను కూడా విత్‌డ్రా చేయించేందుకు పిటిషనర్లతో మంతనాలు జరిపారని, వారిని ఒప్పించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.

వార్డుల సంఖ్య ఎంతంటే..

కోర్టు కేసుల అడ్డంకి తొలగితే వెంటనే జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్‌ ద్వారా 34 వార్డులు లేదా 38 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారని తెలియవచ్చింది. ప్రత్యేక గ్రేడు మునిసిపాలిటీగా ఉన్న నరసరావుపేటను 48 వార్డులుగా విభజించాల్సిన అవసరం ఉంది. తొలుత ఎన్నికలు 34 వార్డులకు నిర్వహిస్తే 105 పోలింగ్‌ బూత్‌లలోను, 38 వార్డులు అయితే 115 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ముగిసి కౌన్సిల్‌ ఏర్పడిన అనంతరం మిగతా వార్డులకు కౌన్సిల్‌లో తీర్మానం చేసిన అనంతరం ఆ వార్డులకు మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలియవచ్చింది. 2021లో ఎన్నికలకు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. ఎలాగైనా ఈసారి పురపాలకసంఘానికి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా టీడీపీ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎన్నికలు నిర్వహించి కూటమి కౌన్సిల్‌ ఏర్పడితే తనతో సఖ్యతగా ఉండని స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధికి ప్రాధాన్యత తగ్గించి చెక్‌ చెప్పాలనే ఉద్దేశంతో ఎంపీ ఉన్నారని ప్రచారంలో ఉంది. ఎన్నికలకు రానున్న వారం రోజులు కీలకంగా మారనున్నాయి. అయితే సర్‌ కార్యక్రమం పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించవద్దంటు కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం వెలువడనిదే ఎన్నికలు జరిగే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement