న్యూస్‌రీల్
పంచాయతీల్లో మొదలైన ఎన్నికల సందడి ఏప్రిల్ 2న ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు రిజర్వేషన్లపై ఆశావహుల లెక్కలు ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026
గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సర్పంచ్‌ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2న ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దాదాపు 4 నెలల నుంచి వీరే కొనసాగుతుండటంతో ప్రజలు అనేక అంశాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధమైంది. అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
బాపట్ల: బాపట్లలోని ఈవీఎం గోదాములను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట బాపట్ల ఆర్డీఓ, తహసీల్దార్ ఉన్నారు.
సత్తెనపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సంకేతాలు వెలువడటంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికలు ఎప్పుడు? రిజర్వేషన్ ఏ కేటగిరీకి వస్తుంది? ఎవరు పోటీ చేస్తారు? అనే చర్చలే వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే నెలాఖరుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనుంది.
రిజర్వేషన్ కేటగిరీపై ఉత్కంఠ...
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కేటగిరీ ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగా మారింది. గతంలో రిజర్వు అయిన పంచాయతీలు ఈ సారి ఎలా ఉంటాయోనని లెక్కలు వేసుకుంటున్న నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి. ఏ పంచాయతీ ఏ కేటగిరీకి వస్తుందన్న స్పష్టత అధికారికంగా వెలువడక ముందే పలువురు తమకు అవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలపైనా దృష్టిపెడుతున్నారు.
నోటిఫికేషన్ కోసం ఎదురుచూపు
ప్రస్తుతం అధికారిక ఎన్నికల షెడ్యూల్ కోసం పల్లె ప్రజలు, రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే అసలు సమీకరణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన వర్గాలు ఎన్నికలపై ఉత్సాహంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో తమ బలాన్ని పెంచుకునేందుకు నాయకులు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అధికార కూటమి శిబిరంలో అంతర్గత విభేదాలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్ల ప్రకటన అనంతరం రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.


