ఓటమి భయంతోనే పోలింగ్‌ బూత్‌ల మార్పు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే పోలింగ్‌ బూత్‌ల మార్పు

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి

రొంపిచర్ల మండలంలో నాలుగు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల మార్పు

నరసరావుపేట రూరల్‌: ఓటమి భయంతోనే పోలింగ్‌ కేంద్రాల మార్పు, ఓటర్‌ జాబితాల జంబ్లింగ్‌కు కూటమి నాయకులు పాల్పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రొంపిచర్ల మండలంలోని నాలుగు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల మార్పును అడ్డుకోవాలని శనివారం జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయం అధికారపార్టీకి పట్టుకుందన్నారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడు, రొంపిచర్ల, వీరవట్నం, ఎడ్వర్డ్‌పేట గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల మార్పు దీనికి నిదర్శనం అన్నారు. ఈనెల 23వ తేదీన ఎంపీడీవో, గ్రామ సచివాలయాల్లో పోలింగ్‌ బూత్‌ల వివరాలను పబ్లీష్‌ చేయడం జరిగిందని తెలిపారు. ఐదు రోజుల వ్యవధిలో ఈనెల 28వ తేదీన నాలుగు గ్రామాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోకి పోలింగ్‌ కేంద్రాలను మార్చారని తెలిపారు. దీనిపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయలేదని, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదన్నారు. ప్రజలకు మేలు చేయలేని కూటమి నాయకులు దొడ్డిదారిన స్ధానిక ఎన్నికల్లో గెలుపొందాలని కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. రొంపిచర్లలో నాలుగు వార్డుల బూత్‌లను పడమటిపాలెంకు మార్చినట్టు తెలిపారు. గతంలో ఈ పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణలు జరగడంతో బూత్‌ను మార్చారని వివరించారు. ఈ పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 850 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి విషయాలు పరిగణలోకి తీసుకోకుండా అధికారులు నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. సంతగుడిపాడుకు చెందిన ఏడు వార్డులను మండల పరిషత్‌ పాఠశాల నుంచి టీడీపీకి అనుకూలంగా ఉండే జెడ్పీ హైస్కూల్‌కు మార్చారని తెలిపారు. ఏడు వార్డుల పరిధిలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఉన్నారని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు కిలోమీటరు వరకు నడిచి వెళ్లాల్సి వస్తుందన్నారు. వీరవట్నంకు చెందిన ఏడు వార్డులను ఇదే విధంగా ఓసీలు నివసించే ప్రాంతంలోకి మార్చారని తెలిపారు. ఫ్యాక్షన్‌ గ్రామమైన ఎడ్వర్డ్‌పేటలో నాలుగు వార్డులను టీడీపీ వర్గీయులు నివసించే ప్రాంతంలోకి మార్చారని తెలిపారు. కొనకంచివారిపాలెంలో ఓటర్‌ లిస్ట్‌ జంబ్లింగ్‌ చేశారని వివరించారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కల్పించాలని తెలిపారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కురుగంట శ్రీనివాసరెడ్డి, పచ్చవ రవీంద్ర, కోడూరి వెంకటేశ్వరరెడ్డి, కల్లం శివారెడ్డి, చపారపు సంజీవరెడ్డి పాల్గొన్నారు.

డీపీవోను కలిసి ఫిర్యాదు చేసిన

డాక్టర్‌ గోపిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement