ఎనిమిది మందికి తీవ్రగాయాలు
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో నున్న వై జంక్షన్ వద్ద శుక్రవారం అర్దరాత్రి ఓ వాహనాన్ని పెళ్లి బృందం బస్సు బలంగా ఢీ కొట్టింది. తెలంగాణానికి చెందిన పెళ్లి బృందం బస్సు గుంటూరు నుంచి తిరిగి కల్వకుర్తికి వెళ్తుండగా రాత్రి 11.30 గంటల సమయంలో వై జంక్షన్ వద్ద ఎటు వెళ్లాల్లో తెలియని పరిస్థితిలో ఎదురుగా నాగార్జునసాగర్ నుంచి దాచేపల్లి వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. నాగార్జునసాగర్‌లో ఓ పాఠశాలలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి గోపిశెట్టి శ్రీనివాసరావు, మేకల వెంకయ్య (వినుకొండ), కేతావత్ నాగరాజు నాయక్ (పాలువాయి), మక్కెన నరేంద్రబాబు(నరసరావుపేట), మురికపూడి రాకేష్ (పౌడిమర్రు), చింతకాయల వెంకయ్య(పెదగార్లపాడు), కత్తుల దుర్గ(దేచవరం), బాణావత్ సైదానాయక్ (భట్రుపాలెం)లు వాహనంలో దాచేపల్లి వస్తున్నారు. ప్రమాదంలో వాహనం బోల్తాపడటంతో వాహనంలో ఉన్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్ వాహనంలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిలో ఏడుగురిని శనివారం నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేశారు. మరో వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. బస్సులోని వారికి ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పెళ్లి బస్సును స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


