వినుకొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పల్నాడు జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, సాగు, తాగునీరు లేక రైతులు అల్లాడిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు రావిపాడు వద్ద గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువకు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దాదాపు రూ.6 వేల కోట్లతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే పల్నాడులో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, రైతులు మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండేదని తెలిపారు.
వరికపూడిశెలపై మౌనమెందుకో..!
కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకొనే నరసరావుపేట ఎంపీ పల్నాడు జిల్లాకు ఏం సాధించారో సమాధానం చెప్పాలని బొల్లా డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నరసరావుపేటకు తీసుకొచ్చిన సమయంలో కూడా పల్నాడు రైతుల ప్రధాన సమస్య అయిన సాగునీటి ప్రాజెక్టులపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. వరికపూడిశెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని గతంలో గొప్పగా చెప్పిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు తాగు, సాగునీటి సమస్యలు తీరతాయని, అలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టి ఇప్పుడు ‘పోలవరం–బనకచర్ల’ అంటూ కొత్త నినాదం తెరపైకి తీసుకురావడం ప్రజలను మభ్యపెట్టడమేనని ధ్వజమెత్తారు.
రైతులపై వేధింపులు ఆపాలి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఈ–క్రాప్ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం బీమా పరిహారం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గంలో పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉంటే, సొసైటీ రుణాల పేరుతో వారి ఇళ్లకు వెళ్లి ఫొటోలు తీసి గ్రూపుల్లో పెడుతూ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలు, రాజకీయ కక్షసాధింపులు పక్కనపెట్టి సత్వరమే వరికపూడిశెల పనులను పూర్తి చేసి పల్నాడు రైతాంగాన్ని ఆదుకోవాలని బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు.
కక్షసాధింపులకే పరిమితం
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చీఫ్ విప్‌గా ఉన్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, రెండు సార్లు ఎంపీఐన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈప్రాంత రైతులకు మేలు చేసే ఒక్క పనీ చేయలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే జీవీ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వైఎస్సార్ సీపీ హయాంలో మంజూరైన నిధులతో మంజూరైన పనులను ప్రారంభించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అమరావతి నిర్మాణంలో ఖర్చు చేసే నిధులు రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని గుర్తు చేశారు. కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నామని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు అసలు పనులు అడ్డుకోవడానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలియజేయాలని సవాలు విసిరారు. ఇప్పటికై నా అసత్య ప్రచారాలు మానుకొని పల్నాడు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాదు, పట్టణ అధ్యక్షుడు అధ్యక్షులు కొత్త మాస శివ, రూరల్ మండలం అధ్యక్షుడు దండు చెన్నయ్య, పట్టణ బీసీ నాయకుడు గుంజి వాసులతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు


