అధికారులకు సూచించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పలు సమస్యలపై దళిత, ప్రజాసంఘాల నేతలు అర్జీలు అందజేత
నరసరావుపేట: ఎస్సీ కమిషన్‌కు అందజేసిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, వాటి పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తగదని సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన కమిషన్ చైర్మన్ జవహర్, కమిషన్ సభ్యులు మేకల బిక్షంలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్‌ఓ కె.అద్దెయ్య మొక్కలను అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్సీ కమిషన్ తరపున అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరుకు చెందిన దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ముద్రించిన షెడ్యూల్ కులాలు, తెగల (అత్యాచార నిరోధక) చట్టం 1989 అనుసరించి సహాయ పునరావాస పరిహారానికి ధన సహాయం – నిబంధనలు అనే బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. దళిత సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను చైర్మన్ ఆదేశించారు.


