వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 81,700 మందికి నేతన్న నేస్తం చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 51,952 మంది ఎంపిక గతంలో జిల్లాలో అర్హులు 422 మంది నేడు 359 మంది మాత్రమే.. రెండేళ్లు నేతన్న సేవలో పథకం ఊసే ఎత్తని ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం తూతమంత్రంగా అమలుకు ప్రణాళికలు రాష్ట్రవ్యాప్తంగా పనులు లేక 250కి పైగా సొసైటీలు మూత ప్రభుత్వం నుంచి విడుదల కాని రూ.230 కోట్ల బకాయిలు నేడు జాతీయ చేనేత దినోత్సవం
నేతన్నకు నేస్తంగా నిలిచిన వైఎస్ జగన్
‘నేతన్నల సేవలో’ పథకంలోనూ కోత
సత్తెనపల్లి: అద్భుత కళతో రంగుల వస్త్రాలను నేసే మగ్గం నేడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మూగబోతోంది. పడుగు గంజి లేక పేక దారంలా నూలు పోగు తెగి చేనేత పరిశ్రమ పడకేసింది. కడుపు నింపే పని ఆకలి తీర్చలేక పోతుండడంతో కులవృత్తిని వదిలి వలస వెళ్లే పరిస్థితి దాపురించింది. చేనేత పరిశ్రమను, కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారం చేపట్టాక చేతులెత్తేశారు. గత రెండున్నరేళ్లుగా ఒక్క పైసా కూడా విదల్చకుండా చేనేత కార్మికులను మోసం చేశారు. గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి పేరు మార్చారు తప్ప గత రెండేళ్లుగా అమలు మాత్రం చేయలేదు. చేనేత కార్మికుల శ్రమను గుర్తించి, స్వదేశీ వస్త్రాల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
లబ్ధిదారుల సంఖ్యలో కోత
చేనేత రంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని, నేతన్నలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయినా చేనేత కుటుంబాల సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 7న ‘నేతన్న సేవలో’ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా కేవలం 359 మందికి మాత్రమే నేతన్న సేవలో పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. కొర్రీలు పెట్టి అర్హులను సైతం అనర్హులుగా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విడుదల కాని రూ. 230 కోట్లు...
చేనేత వస్త్రాలు, రంగు రసాయనాలపై జీఎస్టీని తొలగిస్తామని, కేంద్ర ప్రభుత్వం తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని ఎన్నికల సమయంలో టీడీపీ ముఖ్యనేతలు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత సొసైటీలకు ప్రభుత్వం నుంచి రూ.230 కోట్లు విడుదల కావాల్సి ఉంది. దీనిలో యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేటు కింద రూ. 203 కోట్లు, త్రిఫ్ట్‌ఫండ్ స్కీం కింద రూ. 27 కోట్లు రావాల్సి ఉన్నాయి. ఇవి రాకపోవడంతో చేనేత సొసైటీలో పనులు లేక రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా చేనేత సహకార సంఘాలు మూతపడ్డాయి. ఇది ఇలా ఉంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.310 కోట్లు చేనేత సహకార సంఘాల రుణాలను రద్దు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ఓవర్ డ్యూ, వడ్డీలు చెల్లించలేక చేనేత సహకార సంఘాలకు చెందిన సుమారు రూ.150 కోట్లు రద్దు చేయాలని 16 చేనేత సహకార సంఘాలు ఇటీవల మంగళగిరిలో నిర్వహించిన చేనేతగర్జన సందర్భంగా అడిగినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ఎంతో మందిని ఆదుకుంది. సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఆధునిక పరికరాల కొనుగోలు, ఉపాధి మెరుగుదల కోసం ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 81,700 మందికి, జిల్లాలో 422 మంది చేనేత కార్మికులకు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ. 24 వేలు చొప్పున ఐదేళ్లు నగదు జమ చేశారు. కరోనా సమయంలో ఒక ఏడాదికి సంబంధించిన రెండు విడతల్లో నగదు మొత్తాన్ని ఒకేసారి విడుదల చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 51,952 మందిని మాత్రమే నేతన్నల సేవలో పథకానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో 29,775 మందిని, జిల్లాలో 63 మంది చేనేత కార్మికులను ఈ పథకానికి దూరం చేసిందనే విమర్శలు ఉన్నాయి. అంతేగాక రెండేళ్ల పాటు పథకం వర్తింప చేయకుండా మూడో ఏడాది మాత్రం ఇస్తామంటూ ఊదరగొడుతున్నారు.


