వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి రాష్ట్రంలో గాడి తప్పిన పాలన వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి సత్వరమే రాజీనామా చేయాలని, చిత్తశుద్ధి ఉంటే అక్రమాలపై సీబీఐకి విచారణ అప్పగించాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పీఆర్కే మాట్లాడారు.
డీఎస్పీ అక్రమాలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత, నిరుద్యోగుల ధాటికి తట్టుకోలేని టీడీపీ రౌడీ మూకలు పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు చేయించి ఎక్కడిక్కడ టెంటులు పీకివేసి అడ్డగించే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎంతమందిని అరెస్టు చేసినా, నిరసన కార్యక్రమాన్ని ఆపలేరన్నారు. శిబిరాలను తీసివేస్తే రోడ్డుపై దీక్షలు చేస్తామని, అక్కడ అడ్డగించి అరెస్టు చేస్తే పోలీసు స్టేషన్‌లో సైతం నిరసన కొనసాగిస్తామని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని నిరసన కార్యక్రమాన్ని నీరుగార్చే పని చేస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎన్ని ఆటంకాలు సృష్టించినా
ఉద్యమం ఆగదు..
ఇప్పటికై నా మంత్రి నారా లోకేష్ తను చేసిన తప్పులను ఒప్పుకుని రాజీనామా చేయాలన్నారు. లేకుంటే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్రరూపం దాల్చుతామన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉద్యమం ఆగదని మాచర్లలో పోలీసులు తను సొంత స్థలంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటుచేస్తే అడ్డుకున్నారని, అయినా యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేశారన్నారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీరాజ్యోత్ హనుమంతునాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్‌లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్య, బోయ రఘురామిరెడ్డి, అబ్దుల్ జలీల్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వై.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వరరెడ్డి, గురుబ్రహ్మం, జడ్పీటీసీలు మల్లు స్వామి, బాలు నాయక్, నవులూరి భాస్కర్‌రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, మాజీ జిల్లా వ్యవసాయ శాఖ సలహా అధ్యక్షుడు కుర్రి సాయిమార్కొండారెడ్డి, మాచర్ల పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీను తదితరులున్నారు.


