గురువుల పరీక్షకు వేళాయె..! | - | Sakshi
Sakshi News home page

గురువుల పరీక్షకు వేళాయె..!

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

గురువుల పరీక్షకు వేళాయె..! రేపటి నుంచి టెట్‌ పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో ఐదు కేంద్రాలు హాజరు కానున్న 9194 మంది అభ్యర్థులు ఇన్‌ సర్వీస్‌ టీచర్లకూ తప్పని టెట్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న విద్యాశాఖ అధికారులు

రేపటి నుంచి టెట్‌ పరీక్షలు
అభ్యర్థులకు సూచనలు

టెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను కల్పించాం. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవటం ద్వారా సమయపాలన పాటించాలి. నిర్ణీత సమయానికి మించి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించం. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా.

– పీవీజే రామారావు,

జిల్లా విద్యాశాఖాధికారి

నరసరావుపేట ఈస్ట్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఉపాధ్యాయులను పరేషాన్‌కు గురిచేస్తుంది. ఇప్పటివరకు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు హాజరయ్యే టెట్‌ పరీక్షకు నేడు ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా హాజరు కావలసి రావటంతో వారిలో టెన్షన్‌ నెలకొంది. ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు టెట్‌ పరీక్ష జరగనుంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్‌ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.

5 కేంద్రాలు.. 9,194 మంది అభ్యర్థులు

పల్నాడుజిల్లా పరిధిలో టెట్‌ పరీక్షకు 5 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఆయా కేంద్రాలలో 9,194 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాలలో 1794 మంది, నరసరావుపేట ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో 1327 మంది, ఏఎం రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో 4,334 మంది, తిరుమల ఇంజినీరింగ్‌ కళాశాలలో 1420 మంది, ఎంఏఎం కళాశాల కేంద్రంలో 319 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

టీచర్లకు టెన్షన్‌..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఏన్నో యేళ్లుగా కొనసాగుతూ, విద్యార్థులకు ఎన్నో రకాల పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాలను అంచనా వేసిన ఉపాధ్యాయులు నేడు ఇతర అభ్యర్థులతో కలిసి టెట్‌ రాయాల్సి వస్తోంది. ఉద్యోగ విరమణకు దగ్గర పడుతున్న ఉపాధ్యాయులు సైతం టెట్‌ అర్హత కోసం కష్టపడుతున్నారు. ఇప్పటివరకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఏమాత్రం లేని ఉపాధ్యాయులు నేడు టెట్‌ కోసం శిక్షణ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పటంతో పాటు పాలనా పరమైన పనులు, రికార్డుల నిర్వహణ, పరీక్షలు వాటి మూల్యాంకనం, యాప్‌ల అప్‌లోడ్‌ తదితర పనులతో రోజంతా గడిపే ఉపాధ్యాయులు ఇంటికి వచ్చి టెట్‌ పరీక్షకు సిద్ధం కావటం తలకు మించిన భారంగా మారింది.

ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు కేంద్రాలలోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితులలోనూ కేంద్రం లోకి అనుమతించరు. అలాగే అభ్యర్థులు తమ వెంట హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌, గుర్తింపు కార్డు పరిశీలించిన తరువాతే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒకవేళ హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించక పోయినా, అసంపూర్తిగా ఉన్నా గుర్తింపు కార్డును పరిశీలించి రెండు ఫొటోలు, డిక్లరేషన్‌ పత్రం తీసుకొని అనుమతిస్తారు. దివ్యాంగులకు సహాయకులను విద్యాశాఖ అధికారులే ఏర్పాటు చేస్తారు. అలాగే 50 నిమిషాలు అదనపు సమయం కేటాయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement