చిలకలూరిపేట టౌన్: బంధువుల పెళ్లి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న దంపతుల ఆటోను అడ్డగించి దాడికి పాల్పడిన ఘటన మండలంలోని పసుమర్రు గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడికి చెందిన షేక్ కాలేషా వలి ప్రస్తుతం చీరాలలో నివాసం ఉంటున్నారు. ఆయన తన భార్య షర్మిలతో కలిసి బంధువుల వివాహానికి యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గంమధ్యలో పసుమర్రు గ్రామ సమీపంలో శీతలపానీయం తాగేందుకు ఆగారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతుండగా పసువర్రు గ్రామానికి చెందిన షేక్ జాఫర్ సాదిఖ్ తన బైకును ఆటోకు అడ్డుగా నిలిపి గొడవకు దిగాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి కాలేషా వలి దంపతులపై దాడి చేసి, దుర్భాషలాడుతూ బెదిరించాడు. స్థానికులు జోక్యం చేసుకుని వారిని రక్షించినట్లు తెలిసింది. దాడిలో గాయపడిన కాలేషా వలి, షర్మిల దంపతులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. షర్మిల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి.అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


