పది మండలాల్లో 77.6 మి.మీ వర్షపాతం | - | Sakshi
Sakshi News home page

పది మండలాల్లో 77.6 మి.మీ వర్షపాతం

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

పది మండలాల్లో 77.6 మి.మీ వర్షపాతం పల్నాడు జిల్లా బేస్‌బాల్‌ నూతన కార్యవర్గం ఆరు మండలాల్లో వర్షం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

నరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాలకుగాను పది మండలాల్లో 77.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆదివారం సంబంధిత అధికారులు వెల్లడించారు. రెంటచింతల 3.6 మి.మీ, గురజాల 9.8, దాచేపల్లి 1.6, నరసరావుపేట, మాచవరం మండలాల్లో 1.8 చొప్పున, అచ్చంపేట 15.2, క్రోసూరు 2.6, అమరావతి 12.8, పెదకూరపాడు 22.0, రాజుపాలెం 2.2, ముప్పాళ్ల 4.2, మీ.మీ వర్షం కురిసింది.

రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ బేస్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు చిరంజీవి, సురేష్‌, చిన్నరామయ్య, ఎస్‌ఏఏపీ అబ్జర్వర్‌ పి.నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ బేస్‌బాల్‌ అబ్జర్వర్‌ చి.శ్రీనివాసరావు, ఎన్నికల అధికారి రమణారెడ్డి, ముఖ్య అతిథి వై.సైదయ్య పాల్గొన్నారు. ఎన్నికల్లో పి. మణికంఠ వరప్రసాద్‌ రెడ్డి అధ్యక్షుడిగా, జి.వేమారెడ్డి కార్యదర్శిగా, చి.నాగేంద్రం ఖజాంచీగా, వి.అంజిరెడ్డి ఉపాధ్యక్షుడిగా, పి.కృష్ణారెడ్డి సంయుక్త కార్యదర్శిగా, వి. శివారెడ్డి, ఎ.కమలమ్మ కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంగళగిరి మండలంలో 13.2 మిల్లీమీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ వర్షం కురిసింది. సగటున 2 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. దుగ్గిరాల మండలంలో 12.4 మి.మీ., పెదకాకాని 5, తాడేపల్లి 3.6, తుళ్లూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం కురిసింది.

మార్టూరు: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై కోలలపూడి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. హైవే అంబులెన్సు సిబ్బంది నాయక్‌, స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. కోలలపూడికి చెందిన యార్లగడ్డ ఆదెమ్మ(70) ముప్పవరం నుంచి కోలలపూడి కూడలి వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్లడం కోసం రహదారి దాటుతోంది. ఈ క్రమంలో అదే మార్గంలో కోలలపూడి వైపు వెళ్తున్న ఆటో ఆదెమ్మను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో ఉన్న ఆదెమ్మను హైవే అంబులెన్స్‌ సిబ్బంది నాయక్‌ మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆదెమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆదెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు ఆదెమ్మకు భర్త, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు పట్టించినట్లు సమాచారం.

వేటపాలెం: బైక్‌ పై వెనుక కూర్చొన్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేటపాలెం–చీరాల రోడ్డులో ఆమోదగిరిపట్నం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వేటపాలెం మార్కెట్‌ సెంటర్‌ వద్ద గోలి గోపి(36) నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పి తన పక్కింటి అతని సహాయంతో మోటార్‌ బైక్‌ పై చీరాల హాస్పిటల్‌కి వెళుతున్నాడు. ఆమోద గిరిపట్నం వద్దకు వెళ్లే సరికి బైక్‌ వెనుక వైపు కూర్చునొని ఉన్న గోపీకి ఫిట్స్‌ వచ్చి బైక్‌ పై నుంచి కింద పడి పోయాడు. బైక్‌ ఆపి చూడగా గోపీ మృతి చెంది ఉన్నాడు. బైక్‌ వెనకూర్చుని ఉన్న సమయంలో ఫిట్స్‌ రావడంతో కింద పడి మృతి చెందాడని భావిస్తున్నారు. గోపీ వేటపాలెం సెంటర్లో కర్రీ పాయింట్‌ నిర్వహిస్తుంటాడు. భార్య, ఒక కూతురు ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్సై పి.జనార్దన్‌ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement