మనసారె అర్పించి.. | - | Sakshi
Sakshi News home page

మనసారె అర్పించి..

Aug 3 2026 1:19 AM | Updated on Aug 3 2026 1:19 AM

భక్త బృందాలతో కిక్కిరిసిన ఇంద్రగిరి ● రికార్డు స్థాయిలో సారె సమర్పణలు ● ఉదయాన్నే కిటకిటలాడిన క్యూలైన్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు, భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. ఆలయానికి చేరుకునే కుమ్మరి పాలెం, బ్రాహ్మణ వీధి, కెనాల్‌రోడ్డు, ప్రకారం బ్యారేజీ ఇలా ఏ రోడ్డు చూసినా అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేస్తున్న భక్త బృందాలే దర్శనమిచ్చాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు కుటుంబ సమేతంగా తరలిరావడం కనిపించింది.

8 గంటలకే క్యూలైన్లు కిటకిట..

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సారె సంబరాలు రాత్రి 9 గంటల వరకు ఏకధాటిన కొనసాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆదివారం తెల్లవారుజామునే నగరానికి చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో దుర్గాఘాట్‌ భక్తులతో కిటకిటలాడింది. దుర్గగుడి ఈవో శీనానాయక్‌ దుర్గాఘాట్‌, కేశఖండనశాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటలకే భక్తుల వాహనాలతో హెడ్‌ వాటర్‌ వర్క్స్‌, సీతమ్మవారి పాదాలు, వీఎంసీ కార్యాలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనం, పది గంటల నుంచి అన్ని దర్శన టికెట్ల విక్రయాలను దేవస్థానం రద్దు చేసింది. అన్ని క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు.

మహామండపం మొదటి అంతస్తుకు క్యూ..

ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో అటు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లు ఓం టర్నింగ్‌ వరకు కిటకిటలాడాయి. ఇక మహామండపం 7వ అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు అన్ని క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడం విశేషం. గతంలో భక్తుల క్యూ లైన్‌ మహా మండపం మొదటి అంతస్తుకు చేరిన సందర్భాలు లేవని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అటు ఘాట్‌రోడ్డు, ఇటు మహా మండపం మొదటి అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించడంతో భక్తులు అమ్మవారి పాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవడం కనిపించింది. మధ్యాహ్నం మహా నివేదన సమయానికి పాత మెట్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాత మెట్లపై వచ్చిన వారికి గాలిగోపురం మెట్ల మార్గం ద్వారా స్కానింగ్‌ పాయింట్‌కు మళ్లించారు.

వందకు పైగా భక్తి బృందాలు

ఆదివారం రికార్డు స్థాయిలో వందకు పైగా భక్తి బృందాలు, సుమారు 35వేల మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆషాఢ మాసోత్సవాలలో ఇంత భారీ స్థాయిలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా రద్దీనే కనిపించింది. మహామండపం, రాజగోపురం, లక్ష్మీగణపతి ప్రాంగణం, ఘాట్‌రోడ్డు ఇలా ఎక్కడ చూసినా భక్తులు కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement