బాపట్ల న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి, న్యాయవాదిగా పేరు గడించినా నటనే తన జీవిత లక్ష్యంగా నాటక రంగానికి సేవలందించి, మహాత్మాగాంధీ, ఠాగూర్ లాంటి మహనీయుల ప్రశంసలు పొందిన బళ్లారి రాఘవ యువతకు ఆదర్శమని సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.శివనారాయణ పేర్కొన్నారు. బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా స్థానిక వ్యవసాయ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తన 12ం ఏట నుంచే నటనను ప్రారంభించిన రాఘవాచార్యులు ఆ వయసులోనే బళ్లారిలో షేక్స్‌ఫియర్ క్లబ్‌ను స్థాపించి, ఆంగ్ల నాటక ప్రదర్శనలను జనరంజకంగా ప్రదర్శించారని, కేవలం 27 ఏళ్ల వయసులోనే సునందినీ పరిణయం అనే నాటకంలో 70 ఏళ్ల వృద్ధుని పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారన్నారు. హరిశ్చంద్ర, బృహన్నల, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, రామరాజు చరిత్ర, రామదాసు, మొదలైన నాటకాలలో విభిన్న పాత్రలను పోషించారని, ప్రతినాయక పాత్రలైన హిరణ్యకశిప, దుర్యోధన, మాయలఫకీర్ మున్నగు పాత్రలను అత్యత్భుతంగా పోషించారని, ద్రౌపదీ మాన సంరక్షణం, మాలపల్లి వంటి సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా రాణించారని, సీ్త్రలను రంగస్థలంపైన అభినయించటానికి ప్రోత్సహించారన్నారు. నవరసాలనూ ఒకేసారి ముఖంలో చూపించగల బహుముఖ ప్రజ్ఞావంతులని కొనియాడారు. ఆయన జయంతిని జరుపుకోవడమంటే తెలుగు కళామతల్లికి నీరాజనాలు అర్పించడమేనని అన్నారు. తొలుత బళ్లారి రాఘవ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ డి.వి.సాయిరాంకుమార్, డాక్టర్ బి.అపర్ణ, డాక్టర్ పులి మోహన్‌రావు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జి.శివనారాయణ


