వాస్తవికత కలిగిన రాజధాని మావిగన్‌ | - | Sakshi
Sakshi News home page

వాస్తవికత కలిగిన రాజధాని మావిగన్‌

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

వాస్తవికత కలిగిన రాజధాని మావిగన్‌

గ్రాఫిక్స్‌కే పరిమితమైన రాజధాని అమరావతి పైగా అమరావతి నిర్మాణానికి రూ. లక్షల కోట్లు అవసరం ‘మావిగన్‌’కు కేవలం రూ.20 వేల కోట్లు చాలు దీనిని పక్కదారి పట్టించేందుకే వైఎస్‌ జగన్‌పై విమర్శలు మావిగన్‌పై రాష్ట్ర ప్రజలు లోతుగా ఆలోచించాలి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ గోపిరెడ్డి

చంద్రబాబు ఎలా నిర్మిస్తారు?

నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన రాజధాని ‘మావిగన్‌’కు ప్రజలు మద్దతు తెలియచేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. మావిగన్‌ వాస్తవికతకు దగ్గరగా ఉన్న రాజధాని అని, అమరావతి గ్రాఫిక్స్‌ రాజధాని అనేది తెలుసుకోవాలన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్‌ జగన్‌ ఎప్పుడైతే మావిగన్‌ రాజధాని గురించి మాట్లాడారో అప్పటినుంచి ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోందన్నారు. ప్రతిపాదించిన మూడూ పెద్ద నగరాలని, మచిలీపట్నంలో ఉన్న పోర్టును కూడా అభివృద్ధి చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. ప్రపంచంలో పోర్టు ఉన్న ప్రతి రాజధాని నగరం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. మంచి తీర ప్రాంతం కూడా ఉన్నందున ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో నయా రాయపూర్‌ అనే ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం రాజధాని కట్టారని, ఇప్పటికీ అక్కడ ప్రజలు ఎవరూ నివసించడం లేదని చెప్పారు. ఆఫీసులు మాత్రమే నడుస్తున్నాయని, ఉద్యోగస్తులు ఉదయం 15 కిలోమీటర్ల దూరంలోని రాయపూర్‌ నుంచి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోతున్నారని చెప్పారు. అమరావతి కూడా అదేవిధంగా తయారవుతుందన్నారు.

అభివృద్ధికి అవకాశం

సమీపంలో ఉన్న అభివృద్ధి ప్రాంతాల్లో నివసించేందుకు ఇష్టపడతారన్నారు. రాష్ట్రంలో పోర్టు ఉన్న విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమని తెలిపారు. అక్కడ ఆర్థిక కార్యకలాపాలు బాగా జరుగుతున్నందునే శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. మావిగన్‌ కూడా అదే తరహా అవకాశం కలిగిన ప్రాంతం అన్నారు. కాబట్టి అభివృద్ధి చెందటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రజలందరూ మావిగన్‌పై ఆలోచన చేయాలని సూచించారు. ప్రముఖ విశ్లేషణకర్త, న్యాయవాది మాడభూషి శ్రీధర్‌ చట్టాలు తెలిసిన వ్యక్తి అని, ఆయన మావిగన్‌ను సపోర్ట్‌ చేస్తూ మాట్లాడినందుకు తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ట్రోల్‌ చేస్తూ బూతులు తిడుతున్నారన్నారు. మావిగన్‌ బాగుంది కాబట్టే ఆయన సపోర్ట్‌ చేశారన్నారు. అమరావతి రాజధాని ఎన్నేళ్లలోపు పూర్తి చేస్తారు? ఎన్ని రూ.లక్షల కోట్లు అవసరం అవుతాయో చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్ని తరాలు పడుతుందో చెప్పటానికే కష్టంగా ఉందన్నారు. చిన్నపాటి వర్షం కురిస్తేనే మునిగిపోయే ప్రాంతంలో రూ.లక్షల కోట్లు తీసుకెళ్లి ధారబోసే పని చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందిన నగరాలలో రాజధాని పెడితే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

రైతుల సంతోషం ముఖ్యం

మొక్కజొన్న పంట పండించిన రైతు ఈ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నాడని, దాళ్వా కంటే ఎక్కువగా ఈ ఏడాది మొక్కజొన్న పండించారన్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400 ఉంటే, ప్రైవేట్‌ వ్యక్తులు కేవలం రూ.1650 నుంచి రూ.1700 మాత్రమే ఇస్తున్నారన్నారు. రైతు ఎకరాకు రూ.28 వేలు నష్టపోతున్నాడని చెప్పారు. డబ్బులన్నీ తీసుకువెళ్లి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పోస్తున్నారని విమర్శించారు. అందువల్లే రైతులు పండించిన పంటను కొనలేకపోతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌కు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనాలని గతంలో విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

రూ.300 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్‌ కాలేజీలు పూర్తి చేయటానికి, రూ.3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు చేతులు రాని ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లుతో రాజధాని నగరాన్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారని అన్నారు. కేవలం ప్రజల్ని గ్రాఫిక్‌ మాయాజాలంలో ఉంచుతున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని చెప్పారు. ఇక్కడ రాజధాని నిర్మాణానికి ఒక చదరపు గజానికి రూ.12,500 ఖర్చు పెడుతున్నారని, అదే ఢిల్లీలో రూ.4 వేలతో బ్రహ్మాండంగా కడుతున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో సామాన్యుడు నివాసం ఉండే పరిస్థితి లేదన్నారు. అటువంటి ప్రాంతం రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా వైఎస్‌ జగన్‌ను కూటమి నాయకులు విపరీతంగా దూషిస్తూ మాట్లాడుతున్నారని, కేవలం మావిగన్‌ టాపిక్‌ నుంచి డైవర్ట్‌ చేయడానికే అచ్చెన్నాయుడు, ఏబీఎన్‌ రాధాకృష్ణ తీవ్ర పదజాలంతో దూషణలకు పాల్పడుతున్నారని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కూడా మావిగన్‌పై 45 నిమిషాలు చర్చించారని, మావిగన్‌ కచ్చితంగా మంచి రాజధాని ప్రాంతం అవుతుందని తెలిపారు. దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement