ీసీఎంఎస్ కస్టోడియన్ దొంగిలించినట్లు ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు
పిడుగురాళ్ల: ఏటీఎంలలో నగదు ఉంచాల్సిన ఉద్యోగి ఆ నగదును దొంగిలించి పరారైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పిడుగురాళ్లపట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... పిడుగురాళ్ల పట్టణంలోనే ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చెందిన నాలుగు ఏటీఎంలలో అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ఏటీఎంలో శుక్రవారం రూ. 48 లక్షలు ఉదయం సమయంలో తోటి సిబ్బందితో సీఎంఎస్ గుంటూరు బ్రాంచ్‌కు చెందిన కస్టోడియన్ మామిడి నరేష్ అనే ఉద్యోగి ఏటీఎంలో నగదును పేర్చారు. అతనితోపాటు ఉద్యోగులు కూడా ఉండటంతో తెలివిగా ఏటీఎంలలో నగదును ఏర్పాటు చేసినా లాక్ వేయలేదు. తోటి ఉద్యోగులతోపాటు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలోనే వేరే పని ఉందని చెప్పి గుంటూరుకు వెళ్లకుండా మార్గమధ్యలోనే దిగాడు. తోటి ఉద్యోగులు గుంటూరు వెళ్లిపోయారు. ఆ తరువాత మామిడి నరేష్ ఏటీఎంలకు వచ్చి మొత్తం రూ. 87 లక్షలకుపైగా నగదును ఏటీఎంలో నుంచి తీసుకొని పరారయ్యాడు. ముందుగా ఏటీఎంలలో ఏర్పాటుచేసిన రూ. 48 లక్షలు, అంతకుముందు ఏటీఎంలో ఉన్న మిగిలిన నగదుతో కలిపి మొత్తం రూ. 87 లక్షలకు పైగా ఉన్న నగదును అపహరించారు. నరేష్ పథకం ప్రకారం తిరిగి వచ్చి ఏటీఎంలలో ఉన్న నగదు మొత్తాన్ని చోరీ చేశాడు. ఏటీఎంలో నగదు రాకపోవడంతో పలువురు బ్యాంకు కస్టమర్లు ఆయా బ్యాంకు మేనేజర్లకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూడగా విషయం తెలిసింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీరామ్ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


