హక్కు లేని భూయజమానులు!
రుణాలు పొందలేకపోతున్నాం..
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆన్‌లైన్ కాలేదు..
అచ్చంపేట: 300 సంవత్సరాలనుంచి తరతరాలుగా అనుభవిస్తున్న అనుభవదారులకు ఆ భూములపై ఎంతమాత్రం హక్కులు లేవు. బ్యాంకులలో రుణాలు పుట్టవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసిన రాయితీలు రావు. కనీసం ఆడపిల్లలకు పసుపు కుంకాల కింద గిఫ్ట్‌గా ఇద్దామన్నా ఆ భూములు రిజిష్టరు కావు. కొనుగోళ్లు, అమ్మకాలు కేవలం నమ్మకం, కాగితాలపై రాతలకే పరిమితమవుతాయి తప్ప రిజిస్ట్రేషన్లు జరగవు.
ఈనాం, అగ్రహారం, సత్రం భూములు కావడం వల్లే..
మండలంలో కోగంటివారిపాలెంలో సుమారు 1380 ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. ఆ భూములను అదే గ్రామంలోని రైతులతో పాటు పొరుగు గ్రామాలకు చెందిన 450మంది సాగుచేసుకుంటున్నారు. సుమారు 300 సంవత్సరాలుగా రైతులు ఆ భూములను సాగుచేసుకుని జీవిస్తున్నారు. అయితే వారు ఆ భూములలో పంటలు వేసుకుని వచ్చే ఫలసాయాన్ని అనుభవించడానికి తప్ప మరే ఇతర అవసరాలకు ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆ భూములను విపత్కర పరిస్థితులలో విక్రయించుకోలేరు.. బ్యాంకులలో తనఖాలుపెట్టి రుణాలు పొందలేరు.. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను పొందలేరు.. కనీసం తమ ఆడపిల్లలకు పసుపు కుంకమ కింద కూడా ఇవ్వలేని దారుణపరిస్థితులలో ఆ గ్రామ రైతులున్నారు. కారణం భూములన్నీ అగ్రహారం, ఈనాం, సత్రం భూములు కావడంవల్లే ఈ దుస్థితి.
● ఈ భూములపై తమకు హక్కు కల్పించాలని కోరుతూ ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా తమ గోడు వినిపించుకోవడం లేదంటున్నారు. కంటి తడుపుచర్యగా తమ భూములను జిల్లా సర్వేయర్లచేత సర్వే చేయించి హద్దులు వేయించారని, కానీ ఆన్‌లైన్‌చేసి తమకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన యేడాదిన్నర కాలంలో నలుగురు తహసీల్దార్లు మారారని, కొత్త తహసీల్దార్లు వచ్చిన ప్రతిసారి చేద్దాం... చూద్దామని కాలయాపన చేశారని గ్రామస్తులు వాపోతున్నారు.
భూములు మొత్తం అగ్రహారం బ్రాహ్మణులవే...
గ్రామంలోని భూములు మొత్తం బ్రాహ్మణులవే. జమిందారుల కాలంలో వీరికి దేవాలయాలలో ధూప దీప నైవేద్యలు నిర్వహించేందుకు, వారి పాండిత్యానికి మెచ్చి కానుకల రూపంలో, గ్రామాలకు వచ్చిపోయే బాటసారులకు వసతులు కల్పించేందుకుగాను ఇచ్చిన భూములు. ఆ కాలంలో ఈ భూములపై వచ్చే ఆదాయం చాలకపోవడంతో గ్రామం నుంచి వలసలు వెళ్లిన కొందరు బ్రాహ్మణులు సుమారు 200 సంవత్సరాలక్రితం భూములను కొంతమంది గ్రామంలోని రైతులకు, పొరుగు గ్రామాలలోని రైతులకు అమ్ముకున్నారు. పక్క గ్రామాలైన రుద్రవరం, చిగురుపాడు, అంబడిపూడి గ్రామాలకు చెందిన కొందరు రైతులు వీరివద్ద భూములను కొనుగోలు చేసినవారిలో ఉన్నారు. సదావర్తి సత్రం నిర్వహణకు కేటాయించిన 80 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు రెండు, మూడేళ్లకు ఒకసారి బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఆ భూములపై యేడాదికి సగటున ఎకరాకు రూ.15,000చొప్పున 75 ఎకరాలకు రూ.11.25లక్షల ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తూనే ఉన్నామని రైతులు చెబుతున్నారు.
మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి
కాలగమనంలో చట్టంలో వచ్చిన అనేక మార్పులను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని ఈ భూములపై తమకు హక్కు కల్పించే అవకాశాలున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 300సంవత్సరాలుగా అంటే మూడు, నాలుగు తరతరాలుగా ముత్తాతలు, తాతలు, తండ్రుల నాటి కాలం నుంచి అనుభవిస్తున్న తమకు భూములపై హక్కులు కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ తమను మభ్యపెడుతున్నారే తప్ప తమకు న్యాయం చేయడం లేదనేది రైతుల వాదన.
తరతరాలుగా అనుభవిస్తున్నా సొంతదారులు కాలేని వైనం
కనీసం పసుపు కుంకుమ కింద కూతుళ్లకు భాగం ఇవ్వలేని తల్లిదండ్రులు
భూములపై పుట్టని అప్పులు..
అందని ప్రభుత్వ సాయం
అచ్చంపేట మండలం
కోగంటివారిపాలెం రైతుల దుస్థితి
భూములపై హక్కుకై అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మా అభ్యర్థనలు మొత్తం బుట్టదాఖలు అవుతున్నాయే తప్ప అధికారులెవ్వరు దృష్టి పెట్టడంలేదు. భూ హక్కు చట్టం ప్రకారం దున్నేవాడితే భూమి అయినప్పుడు మేం మూడు, నాలుగు తరాలుగా భూములను అనుభవిస్తున్నా ఎందుకు హక్కు కల్పించడంలేదో అర్థం కావడం లేదు. భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం వల్ల బ్యాంకుల్లో అప్పులు పుట్టడంలేదు. ప్రభుత్వం నుంచి రావలసి రాయితీలు రావడంలేదు. ఈ క్రాప్ చేసుకునే వెసులుబాటు కూడా లేకపోవడంతో ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర కూడా దక్కడంలేదు. ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకోవలసి వస్తోంది.
– బోనం నాగిరెడ్డి, సర్పంచ్, కోగంటివారిపాలెం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామంలోని సాగుభూములన్నింటినీ ఆన్‌లైన్ చేసేందుకు జిల్లా సర్వేయర్ల బృందం వచ్చి రెండు మూడు సార్లు సర్వే చేశారు. ఉన్నతాధికారులు కూడా రైతులకు హక్కులు కల్పించే అవకాశాలు ఉన్నాయంటూ రికార్డులను కూడా తయారు చేశారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మా పరిస్థితి భూములుండి కూడా లేనట్లయింది. అధికారులు ఇప్పటికై నా ఈ భూములపై దృష్టి పెడితే అనుభవదారులకు హక్కు కల్పించి ఆన్‌లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే అవకాశాలున్నాయి.
– సుంకర శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్, కోగంటివారిపాలెం
హక్కు లేని భూయజమానులు!
హక్కు లేని భూయజమానులు!


