వీధి కుక్కల స్వైరవిహారం
దూడ మృతి
యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన రైతు నాగళ్ల అశోక్‌కు చెందిన పశువుల షెడ్డులోకి చొరబడిన కుక్కల గుంపు, ఒక గేదె దూడపై విచక్షణారహితంగా దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన దూడ మృత్యువాత పడింది. కొద్ది రోజులుగా ఇదే తరహాలో రాత్రి వేళల్లో కుక్కలు మూకుమ్మడిగా పశువుల పాకలపై పడి దాడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మూడు దూడలను పీక్కుతిన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులే కాకుండా, చిన్నారులను, మహిళలను వెంబడించి కరుస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే వణికిపోతున్నామని, అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల సమస్య నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.


