సహకార ఉద్యోగుల ఆందోళన ఉధృతం
● జీఓ నెంబర్ 36 అమలు చేసి, 2019 నుంచి వేతన సవరణ చేయాలి,
● 2024 వరకు మధ్యంతర భృతి ఇవ్వాలి.
● గ్రాడ్యుటీని రూ.2 లక్షలకే పరిమితం చేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల గ్రాడ్యుటీ చట్టానికి అనుగుణంగా చెల్లించాలి.
● ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి.
● ఉద్యోగులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, డ్యూటీలో మరణిస్తే రూ.20 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలి.
రొంపిచర్ల: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ 20 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నుంచి స్పందన కరువైంది. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్లు ఐక్యంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 6వ తేదీన ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచీల ఎదుట ధర్నా నిర్వహించారు. 16వ తేదీన అన్ని జిల్లాల సహకార శాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. 22వ తేదీన 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఎదుట ధర్నాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆరు దశల్లో ఆందోళన చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటికే నాలుగు దశల ఆందోళన కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగిలిన ఆందోళన కార్యక్రమాలను ఈనెల 29వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 5వ తేదీన విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది.
నిరవధిక దీక్షలకు సిద్ధం
వేతనాలు తదితర ప్రయోజనాలను డీఎల్‌ఎస్‌ఎఫ్ ద్వారా చెల్లించాలని 12 డిమాండ్‌లపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించే వరకు ఆందోళనలను విరమించబోమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకగా నిలిచిన సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో తలపెట్టిన మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరానున్నారు. ఈ పరిస్థితుల్లో సహకార ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి పరిస్థితి నెలకొంది.
20 రోజులుగా కొనసాగుతున్న
ఆందోళన
స్పందన లేని ప్రభుత్వం
ఆగ్రహంలో జేఏసీ నాయకులు
మహాధర్నాకు సిద్ధమంటున్న జేఏసీ
సహకార ఉద్యోగుల ఆందోళన ఉధృతం


