ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మళ్లీ ఆక్రమణలు
నరసరావుపేట: ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టీడీపీ, జనసేన వర్గీయులు మళ్లీ ఆక్రమణలకు తెరతీశారు. ఒకప్పుడు ఆక్రమణలు అంటూ మున్సిపల్, ఆర్టీసీ అధికారులు నిర్ధారించి వాటిని పోలీసుల సహాయంతో తొలగించిన విషయం విదితమే. ఓ టీడీపీ నాయకుడు రెండు విభాగాలకు చెందిన అధికారుల చేతులు కట్టేశారు. వివరాలు..ఆర్టీసీ బస్టాండ్‌లో నుంచి బస్సులు బయటకు వచ్చే మార్గంలో వినుకొండ రోడ్డుకు మసీదు పక్కగా ఈ ఆక్రమణలు వెలుస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్టీసీ అధికారుల కోరికతో మున్సిపల్ అధికారులు ఆక్రమణలను నిర్ధారించి వాటిని పోలీసుల సహాయంతో తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. అక్కడనున్న డ్రెయినేజీపై కాంక్రీటు నిర్మాణాలను ఏర్పాటుచేసి శుభ్రం చేశారు. అయితే డ్రెయినేజీపై ఏర్పాటుచేసిన ఓ వ్యక్తికి చెందిన బంకును తొలగించటంతో అతను ప్రభుత్వం మారగానే టీడీపీ, జనసేన జెండాలతో అదే ప్రదేశంలో బంకు ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నాడు. ఇటీవల పట్టణానికి మూడు అరకు కాఫీ స్టాళ్లు మంజూరుకాగా వాటిలో ఒక దానిని ఇదే ప్రదేశంలో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు చేయటం గమనార్హం. దీంతోపాటు మరో బంకును తీసుకొచ్చి అక్కడ నెలకొల్పారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఆ ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు లెటర్ పెట్టారు. దీనిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించగా మీకేమి సంబంధం, ఆ ప్రదేశం ఆర్టీసీది వారే చూసుకుంటారు అంటూ సదరు నాయకుడు వారించటంతో వారు మిన్నకుండిపోయారు. ఇటు ఆర్టీసీ అధికారులను మున్సిపల్ అధికారులు చూసుకుంటారులే మీరు జోక్యం చేసుకోకండి అంటూ వారిని వారించినట్లు తెలిసింది. బస్టాండ్ నుంచి బస్సులు బయటకు వస్తుండగా రోడ్డుపై రాకపోకలు చేస్తున్న వాహనాలు తాము రోడ్డుపైకి వచ్చేంత వరకు కన్పించట్లేదనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా డ్రైవర్లు చేస్తున్నారు. దీంతో గత ప్రభుత్వంలో ఆర్టీసీ అధికారులు అక్కడున్న ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరటంతో పోలీసుల సహాయంతో వాటిని తొలగించారు. ఇప్పుడు అదే ప్రదేశంలో మళ్లీ బంకులు ఏర్పాటుచేసి ఆక్రమణకు సిద్ధమవుతున్నారు. ఆక్రమణదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో అధికారులు మారుమాట్లాడలేకపోతున్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేసే అరకు కాఫీ స్టాల్‌ను సైతం అదే ప్రదేశంలో ఏర్పాటు చేస్తుండటం చూస్తుంటే అధికార పార్టీ పోకడ అర్ధం చేసుకోవాల్సి వుంది. ఇప్పటివరకు బస్టాండ్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులను వివిధ ప్రదేశాలకు తరలించే ఆటో డ్రైవర్లు తమ వాహనాలను ఈ ప్రదేశంలో నిలుపుకుంటున్నారు. ఇప్పుడు వారిని కాదని ఆ ప్రదేశంలో వ్యాపారం నిర్వహించుకునేందుకు బంకులు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు స్పందించి ఆ ప్రదేశంలో ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన ఆర్టీసీ డీఎం బూదాటి శ్రీనివాసరావును వివరణ కోరగా ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు లెటర్ ఇచ్చామన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావును వివరణ కోరగా అది ఆర్టీసీ స్థలమని, ఆ ప్రదేశంతో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొనటం గమనార్హం.
అరకు కాఫీ స్టాల్ ఏర్పాటుకు
ప్రయత్నాలు
బంకులు ఏర్పాటు చేస్తున్న టీడీపీ శ్రేణులు
టీడీపీ నాయకుడి హుకుంతో చోద్యం
చూస్తున్న ఆర్టీసీ, మున్సిపల్ అధికారులు
ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మళ్లీ ఆక్రమణలు


