నాగాభరణం బహూకరణ
నకరికల్లు: నర్శింగపాడు గ్రామంలోని గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామికి నకరికల్లుకు చెందిన తిరువీధుల శ్రీనివాసరావు దంపతులు వెండి నాగాభరణాన్ని గురువారం సమర్పించారు. రూ.7.5 లక్షల విలువైన వెండి నాగాభరణాన్ని ఆలయ అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. తిరువీధుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
కర్లపాలెం: చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్భంగా దివ్య హోమ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 9 మంది వేద పండితులచే ఘనంగా హోమం జరిపించారు. కార్తికమాసం ఆఖరి రోజును పురస్కరించుకుని అమ్మవారికి శక్తి స్వరూపిణి అలంకారం చేశారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బాపట్లకు చెందిన విజయలక్ష్మి నాదస్వర బృందం మంగళవాయిద్యాలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో తెనాలికి చెందిన రంగిశెట్టి రమేష్ రంచించిన రావమ్మ రావమ్మా బగళాముఖి అనే పాటను పృధ్వీ మనోజ్ చేత పాడించి ఆవిష్కరింపచేశారు. కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి అభివృద్ధి కమిటీ చైర్మన్ కలకోట చక్రధర్‌రెడ్డి సభ్యులు పట్టాభిరామరావు, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
పెదకూరపాడు: రైల్వే ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా అమరావతి సత్తెనపల్లి మార్గంమధ్యలో ఉన్న పెదకూరపాడు రైల్వే గేటు 21, 22, 23 తేదీల్లో మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు పునరుద్ధస్తారని చెప్పారు. ప్రయాణికులు వేరే మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : నిర్మాణదారులు, వెండర్ల మధ్య అనుసంధానం కోసం నారెడ్కో యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నారెడ్కో రాష్ట్ర కార్యదర్శి మామిడి సీతారామయ్య తెలియజేశారు. గురువారం నగరంలోని ఓ హాటల్‌లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణదారులు, వెండర్ల మధ్య పరస్పర సహకారం, కమ్యూనికేషన్‌ను మరింత బలపరిచేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో నారెడ్కో ద్వారా నిర్మాణదారులకు, వినియోగదారులకు ఆధునిక నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మధుసూదనరెడ్డి, చుక్కపల్లి రమేష్, క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ అంకారావు, సెక్రటరీ మాదాల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వి. శ్రీనాథ్, ట్రెజరర్ సీహెచ్ తిరుపతయ్య, అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
నాగాభరణం బహూకరణ


