నిరంతరాయంగా విద్యుత్ సరఫరాపై దృష్టి సారించాలి
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
నరసరావుపేట రూరల్: విద్యుత్ సమస్యలను పరిష్కరించి నిరంతరాయంగా సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. జొన్నలగడ్డలోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం పల్నాడు సర్కిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ లైన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేవిధంగా చూడాలన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యుత్ శాఖ పనితీరుపై ప్రభుత్వం చేపట్టిన సర్వేలో సంతృప్తి స్థాయిలో స్పందన వచ్చిందన్నారు. వినియోగదారులు నూరు శాతం సంతృప్తి చెందేలా సిబ్బంది పనితీరు కల్పించాలని తెలిపారు. ఆపరేషన్స్, నిర్వహణలో సిబ్బంది పనితీరుపై స్పష్టత ఉండాలని తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేస్తే మెరుగైన సరఫరా ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ అమర్చే అంశంపై అవగాహన కల్పించాలన్నారు. దీంతోపాటు కుసుమ్ పథకంపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకంపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు. ఏపీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్లు ఎ.మురళీకృష్ణ యాదవ్, టీవీఎస్‌ఎన్ మూర్తి, వెంకటేశ్వర్లు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి డాక్టర్ పత్తిపాటి విజయ్‌కుమార్, పల్నాడు సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సీనియర్ అకౌంట్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.


