ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నరసరావుపేట: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, రైతు బాంధవుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు, పలువురు బీసీ నాయకులు హాజరై గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ బడుగుల ఆరాధ్య దైవం గౌతు లచ్చన్న అంటూ కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలోని బలహీన వర్గాలకు చెందిన గీత కార్మిక గౌడ కులానికి చెందిన వారని, తన 17 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న యువకిశోరం అన్నారు. తన 33 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమానికి దక్షిణ భారతదేశం నుంచి నాయకత్వం వహించారని, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, శాసనోల్లంఘన ఉద్యమాలు నిర్వహించి ప్రజలచే ‘సర్దార్‘ బిరుదుతో పిలిపించుకున్న మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడన్నారు. గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం ఆ తరువాత రాజకీయాలను వారు తీవ్రంగా ప్రభావితం చేశారన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరోసారి ఎమ్మెల్సీగా సమర్థవంతంగా పనిచేశారన్నారు. మొట్టమొదటి ఆల్ ఇండియా కిసాన్ మహాసభను మన రాష్ట్రంలో నిర్వహించారని, ఆయన మన రాష్ట్రంలో పుట్టడం మనకు గర్వకారణమన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, తహసీల్దార్, వేణుగోపాలరావు, బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ కే.శ్రీనివాసులు, నాగారపు గురు ఆంజనేయులు, సుతారం విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళి
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళంలో జన్మించిన సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ గౌరవం పొందిన ఏకై క వ్యక్తి అన్నారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు ప్రజలిచ్చిన బిరుదు సర్దార్ అని తెలిపారు. జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. బడుగువర్గ పోరాట జీవిగా లచ్చన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(పరిపాలన), ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎంటీ ఆర్‌ఐ ఎస్.కృష్ణ, ఏఎన్‌ఎస్ ఆర్‌ఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
1/1
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు