
రిటైర్డ్ పోలీసు అధికారి వెంకటేశ్వర్లుకు సర్వీసు అవార్డ
బాపట్ల: రిటైర్డ్ పోలీసు అధికారి అద్దంకి వెంకటేశ్వర్లు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి పోలీస్ మెడల్ ఫర్ మెమోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకటేశ్వర్లు ఒంగోలు పీటీసీలో ఎస్‌ఐగా ఉద్యోగ విరమణ చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పులిగడ్డవారిపాలేనికి చెందిన ఆయన కానిస్టేబుల్‌గా 1983లో చేరి, అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగ సమయంలో 205 రివార్డులతోపాటు ఉత్తమ సేవా పతకం, సెంట్రల్ హోం మినిస్టర్ మెడల్, ఇండియన్‌న్‌పోలీస్ మెడల్ అందుకున్నారు. ముఖ్యంగా లాలాపేటలో దొంగనోట్ల కేసు, గోల్డ్ కుంభకోణం, ఎర్ర చందనం వంటి పలు కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేశారు. పల్నాడు ప్రాంతంలో పనిచేసిన కాలంలో నక్సలైట్ల కేసులో చురుకుగా పనిచేసి పలువురిని అరెస్ట్ చేశారు.
పేద విద్యార్థులకు సాయం
పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి వారి భవిష్యత్‌కు వెంకటేశ్వర్లు బంగారు బాట వేశారు. పలువురు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2003లో మెట్టగౌడపాలేనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దత్తత తీసుకుని పూర్తిగా ఆర్థిక సాయం అందించారు. 2012లో ఐలవరంలో ఇంటర్ విద్యార్థికి ఆర్థిక సాయం, భట్టిప్రోలులో ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో వెల్లటూరులో తండ్రి అప్పుల ఊబిలో చిక్కుకుని చనిపోతే కూతురుని చదివించారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. 2018లో దాచేపల్లిలో ఓ బాలికను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించి, మానవత్వం చాటుకున్న పోలీస్‌గా నిలిచారు.