
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి
● దొడ్లేరు గ్రామంలో పర్యటన
దొడ్లేరు(క్రోసూరు): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతమైన మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని శనివారం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ బి.రవి సందర్శించారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్‌తో కలసి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలను, ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణులు, పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల ఉధృతి పెరగకుండా మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయించారు. అనంతరం హసనాబాద్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మొగల్ సుభాన్‌బేగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ భూలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు ప్రేమరాజ్, ప్రహ్లాద్, అనుపమ, ఆశా కార్యకర్తలు త్రివేణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.