
రైతులు, కౌలురైతులను ఆదుకోవాలి
బాపట్ల: అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య పేర్కొన్నారు. బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ శాఖా కార్యదర్శులు, పట్టణ, మండల కమిటీ సభ్యుల జిల్లాస్థాయి తరగతులు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షతన శనివారం జరిగాయి. గంగయ్య మాట్లాడుతూ వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎక్కువ చోట్ల వరిని వెద పెట్టడం వల్ల నీట మునిగి నష్టపోయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులతో పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఉంచి పేదలను దోపిడీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ మజుంధర్, ఎం వసంతరావు, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య