
గుంటూరు రేంజ్ కార్యాలయ ఆవరణలో వేడుకలు
నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జెండా ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ, పోలీస్ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్‌ఎస్‌ఐలు సంపంగిరావు, ప్రసాద్, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆటో బోల్తా..పలువురికి తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
మేడికొండూరు : మండల పరిధిలోని గుండ్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన మహిళలు నల్లపాడు పరిధిలో ఓ వివాహానికి వెళుతూ పాటిబండ్ల నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత గుండ్లపాలెం వద్ద ఎదురుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిరిపురం గ్రామానికి చెందిన మిరియాల లిల్లీ రాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆటో లాక్కొని వెళ్లడంతో పక్కటెముకలు దెబ్బతిన్నాయి. కుడి చేయితో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గమ్మకు కానుకగా
బంగారు లక్ష్మీహారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన భక్తులు 82 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని కానుకగా సమర్పించారు. వడ్లమూడికి చెందిన వి.శ్రవణ్‌కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ.8.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, పచ్చలతో తయారు చేయించిన లక్ష్మీహారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్. రమేష్‌బాబు, ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ సెలవుదినంతో పాటు, శనివారం శ్రీకృష్ణాష్టమి సెలవు, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. సెలవులకు తోడు వివాహ సుముహూర్తాలు కూడా ఉండడంతో నూతన వధూవరులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

గుంటూరు రేంజ్ కార్యాలయ ఆవరణలో వేడుకలు

గుంటూరు రేంజ్ కార్యాలయ ఆవరణలో వేడుకలు