
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం
నరసరావుపేట రూరల్: ఎందరో మహానుభావుల త్యాగఫలం వలనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం, కోట సెంటర్‌లోని గాంధీ విగ్రహాల వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర భారతావని నేడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని తెలిపారు. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అడుగులు పడ్డాయని తెలిపారు. గ్రామ సచివాలయాలు నిర్మించి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, ఆర్‌బీకేలను నాడు జగనన్న నిర్మించారని తెలిపారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు పెట్టి మద్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరి చేయిస్తున్నారని విమర్శించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. పంటతోపాటు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు.
వరద నీటిలో రాజధాని నిర్మాణం సాధ్యమా?
అమరావతి రాజధానిని చూస్తే బాధగా ఉందని, వరదలతో రాజధాని నదిలా మారిందన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి నీళ్లు తోడటం తప్ప నిర్మాణం చేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు మేల్కొని రాజధానిని గుంటూరు–మంగళగిరి మధ్య ఏర్పాటు చేస్తే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. అమరావతిలోనే రాజధాని కట్టాలనుకుంటే మరో ఏళ్లు అయినా అది పూర్తికాదని, అక్కడ అభివృద్ది జరగదన్నారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో దాదాపు రెండేళ్లు పూర్తికావచ్చిందని, మిగిలిన కొద్ది కాలంలో ఎలా నిర్మాణం చేయగలరో ఆలోచన చేయాలని చంద్రబాబుకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి