
చిన్నబాబుకు అధికారులు సెల్యూట్
నారా లోకేష్ సేవలో తరించిన జిల్లా అధికారులు
రాజకీయ వేదికగా మార్చేసిన మంత్రి లోకేష్
సొంతింటి కార్యక్రమంగా నిర్వహణ
మీడియాపై అణువణువునా ఆంక్షలు
తమ అనుకూల పత్రికకు మీడియా హక్కులు ధారాదత్తం
మిగతా వారికి నో ఎంట్రీ
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగంతో సాధించుకున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి. అధికారులు తమ హోదాలను మరిచి చిన్నబాబు సేవలో తరించారు. ఇతరులను అనుమతించకుండా తమ అనుకూల మీడియాకే అధికారం మొత్తం అప్పజెప్పారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడి
మంత్రి లోకేష్ ప్రసంగంలో రాజకీయాలకు, కులమతాలతకతీతంగా పాలన సాగిస్తామంటూనే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ బురద జల్లారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన సుమారు రూ.2 లక్షల కోట్ల అప్పుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. స్వాతంత్య్ర వేడుకల్లో గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా జిల్లా అభివృద్ధి గురించి ప్రస్తావించేవారు. కానీ లోకేష్ ప్రసంగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడిగా సాగింది. జిల్లా అభివృద్ధి గురించి పక్కన పెట్టారు. ప్రసంగాన్ని
గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతోనే ప్రారంభించారు. లక్షల ఉద్యోగాలు, అద్భుతమైన ఇండస్ట్రీలు వచ్చేస్తాయంటూ త్రిశంకు స్వర్గాన్ని చూపించారు. లోకేష్ స్వోత్కర్షపై కొందరు అధికారులు ఇదేంటి అంటూ గుసగుసలాడారు. కార్యక్రమాన్ని కూడా అధికారులు ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలి. అయితే, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌కుమార్, జిల్లా అధికారులు కూడా హుందాగా వ్యవహరించలేదు. పలుమార్లు మీడియా ప్రతినిధులు వెళ్లి ప్రశ్నించగా, వారిని గదమాయించే ప్రయత్నం చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో అపశ్రుతులు
పోలీసు పరేడ్ మైదానం రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చిత్తడిగా మారింది.
అధికారులు కూడా ఏర్పాట్టను అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఆహూతులు కూర్చునే వేదికల్లో కూడా నీరు చేరింది. శకటాలు ప్రదర్శన సందర్భంగా కొన్ని బురదలో కూరుకుపోయాయి. క్రేన్‌తో వాటిని బయటకు తీయించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చాలా వరకు తగ్గించేశారు. ప్రదర్శించిన కొందరు కూడా బురద కారణంగా అసౌకర్యానికి గురయ్యారు. పార్కింగ్ ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. లోకేష్ రాగానే ఆయన కాన్వాయిని రోడ్డుకు అడ్డంగా నిలిపి మొత్తాన్ని బారికేడ్లతో మూయించారు.