
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
చీరాల టౌన్: జెండా వందనం సాక్షిగా తోటవారిపాలెం తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. చీరాల మండలంలోని తోటవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జెండా వందనం అనంతరం నిర్వహించిన గ్రామసభలో వారు బాహాబాహీకి దిగారు. ఒక వర్గానికి కుర్చీలు వేసి మరో వర్గానికి వేయకపోవడంతో వారు దాడులకు తెగబడ్డారు. దీంతో అటు అధికారులు, ప్రజలు విస్తుపోయారు.
తోటవారిపాలెం పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఎం.భారతి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. టీడీపీలోని రెండు వర్గాల వారు కూడా హాజరయ్యారు. గ్రామసభ వేదికపై అధికారులకు మాత్రమే కుర్చీలు వేయాలి. పంచాయతీ కార్యదర్శి మాత్రం ప్రోటోకాల్ పదవులు లేని వారిని వేదికపై కూర్చోబెట్టారు.. మాజీ వైస్ ఎంపీపీ వర్గానికి చెందిన ఓ డీలర్ ... మాజీ వార్డు మెంబర్ ఆదాంపై వేదికపై ఉండటంతో ఆగ్రహానికి గురయ్యారు. ‘మేం అసలైన టీడీపీ నాయకులం... మేం చెప్పిన వారినే కుర్చీలో కూర్చోబెట్టాలి. టీడీపీ నాయకులకు అధికారులు ప్రోటోకాల్ ఇవ్వాలని’ పంచాయతీ అధికారులకు హుకుం జారీ చేశారు. గతంలో ఉన్న పాత గొడవల నేపథ్యంలో డీలర్ సురేష్.. మాజీ వార్డు మెంబర్ ఆదాంపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు తెగపడటంతో అటు ప్రజలు, ఇటు అధికారులు విస్తుపోయారు.
తరచూ ఆధిపత్య పోరు
తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు కారణంగా గ్రామాల్లో తరచుగా ఇలా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, ఈవోఆర్డీని రామకృష్ణను వివరణ కోరగా తోటవారిపాలెం గ్రామసభలో ఇరువర్గాల వారు తన్నుకున్నారని తెలిసిందన్నారు. దీని గురించి పంచాయతీ కార్యదర్శి భారతి వివరణ తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరి శివరామప్రసాద్‌పై కూడా దాడి చేసి కొట్టారు. పంచాయతీ కార్యదర్శి మేడికొండ భారతి తీరు వల్లే ఈ ఘర్షణ జరిగిందనే ప్రచారం సాగుతోంది.