
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
పెదకాకాని: స్థానిక శివాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్థానాచార్యులు పొత్తూరు సాంబశివరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొన్న ముత్తయిదువులకు దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదంగా పసుపుకుంకుమ, జాకెట్ ముక్క, అష్టలక్ష్మీ దేవి రూపు, కంకణం అందజేశారు. భ్రమరాంబ అమ్మవారు లక్ష గాజుల ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.భక్తులు పెద్దసంఖ్యలో భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు.

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు