
ముగిసిన పవిత్రోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. దాతలు యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మిల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో మూడోరోజున మండప పూజలు జరిగాయి. అనంతరం ఉపాలయాలలో పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం కలశానికి ఉద్వాసన చేసి కలశాలలోని పుణ్యజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పవిత్రాలను తొలగించిన తర్వాత స్వామివారికి విశేషాలంకారం చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధే ధ్యేయం
నరసరావుపేట రూరల్: మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్డాండ్ ఆవరణలో శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, కలెక్టర్ అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్‌డీవో మధులతలు పాల్గొన్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంపీ లావు మాట్లాడుతూ మహిళల సాధికారితకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలు పురోగతి సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ అజితకుమారి, డీఎం బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన పవిత్రోత్సవాలు