
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
అడిషనల్ ఎస్పీ సంతోష్
నరసరావుపేట రూరల్: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి అందరూ నడుం బిగిద్దామని జిల్లా అడిషనల్ (అడ్మిన్) ఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌పై కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంతోష్ పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు, వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కుటుంబానికి, సమాజానికి, దేశానికి హానికరమని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించిందని, యువతను మాదక ద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్ధలు భాగస్వామ్యం కావాలని కోరారు. కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం రవాణా వలన ఏర్పడే చట్టపరమైన పరిణామాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యసన నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో అడిషనల్ ఎస్పీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎం.వెంకటరమణ, ఎస్‌బీ–2 సీఐ పి.శరత్‌బాబు, ఈగల్ సెల్ ఎస్‌ఐ జె.శ్యామ్యూల్ రాజీవ్‌కుమార్, రూరల్ ఎస్‌ఐ కిషోర్, ఫాతిమా, కళాశాల చైర్మన్ ఎం.రామశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.