
నేర రహిత సమాజానికి కృషి చేయాలి
సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి
సత్తెనపల్లి: రాజీ మార్గమే రాజ మార్గమని, నేర రహిత సమాజ కోసం అందరూ కృషి చేయాలని సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వచ్చే నెల 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ క్రిమినల్ కేసులు రాజీ చేయాలని, దీనిపై పోలీస్ అధికారులతో పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆయా స్టేషన్లలో ఉన్న రాజీ పడదగిన సెక్షన్లు ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. ఆయా స్టేషన్లు పరిధిలో ఉన్న కాంపౌండబుల్ నేరాల కేసులు అన్నీ వచ్చే నెల 13న జరిగే లోక్ అదాలత్ పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. సమీక్షలో న్యాయమూర్తులు తౌషిద్ హుస్సేన్, జె.సృజిన్‌కుమార్, సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, ఆయా పోలీస్‌స్టేషన్ల ఏస్‌హెచ్‌ఓలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.