
చిన్నారులపై ఔదార్యం చూపండి
గుంటూరు వెస్ట్: సమాజంలో ఏ పాపం చేయకపోయినా అనాధలుగా జీవించే వారిపట్ల ఔదార్యం ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారితో కలిసి కలిసొచ్చే కాలానికి – నడిచొచ్చే పిల్లలు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. సమాజంలో ఎవరైనా చిన్నారులను పెంచుకోవాలి అనుకున్న వారికి హోమ్స్‌లో ఉన్న 6–18 సంవత్సరాల వయస్సున్ను వారిని తాత్కాలికంగా తొలి 6 నెలలు తమ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవచ్చన్నారు. ఇద్దరికీ నచ్చితే మరో ఆరు నెలలు ఇలా 2 సంవత్సరాల వరకు పెంచుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో దత్తత తీసుకునే వీలుంటుందని వెల్లడించారు. దీనికిగాను బిడ్డ ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.4000 ఉచితంగా అందజేస్తుందన్నారు. దీనివలన ఎంతో మంది అనాధలకు తల్లిదండ్రులు, గార్డియన్స్ లభిస్తారని, పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి సంప్రదించాలని కోరారు. ఐసీడీఎస్ పీడీ ప్రసూన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏడుగురు కమిటీ సభ్యులు దత్తత కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జ్యోతిబసు, హౌసింగ్ పీడీ ప్రసాద్, సీపీఓ శేషశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.