
తాళం వేసిన ఇంట్లో చోరీ
వెండి, బంగారు ఆభరణాలు, నగదు మాయం
పిడుగురాళ్ల: వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన ఒకరి ఇంట్లో చోరీ జరిగిన ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బస్టాండ్ వెనుక ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుడు వి.ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... వరుసగా ప్రభుత్వ సెలవులు రావటంతో బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో తామెళ్లామని, తిరిగి సోమవారం ఉదయం రావటంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని, తలుపులు తీసి చూస్తే, బీరువాలోని దుస్తులన్నీ కింద పడవేసి ఉన్నాయని, బీరువా లాకర్ పగలగొట్టి ఉందని తెలిపారు. బీరువాలోని నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించకపోవటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. పిడుగురాళ్ల పట్టణ ఎస్‌ఐ మోహన్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కూ్‌ల్స్ టీమ్‌కు సమాచారం అందించారు. దీంతో కూ్‌ల్స్ టీమ్ ఎస్‌ఐ రహీమ్, ఏఎస్‌ఐ సురేంద్రల బృందంతో దొంగతనం జరిగిన విధానాన్ని, దొంగలు ఏమైనా ఆధారాలు విడిచిపెట్టారనే విషయాన్ని, వేలిముద్రలను సేకరించారు. బాధితుడు ఆంజనేయులు బీరువాలో రూ. 50 వేల నగదు, సుమారు రూ. 15 లక్షల విలువ చేసే బంగారు అభరాణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు తెలిపారు.