
ప్రకృతి సేద్యం ప్రపంచానికి ఆదర్శం
విదేశీ యూనివర్సిటీ బృందం
పల్నాడు జిల్లా కొత్తపాలెం సందర్శన
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన
పర్యావరణానికి మేలు.. ప్రజలకు కూడా
ఆరోగ్యం, ఆదాయం అంటూ కితాబు
రసాయన రహిత పంటలతో ప్రపంచ
దృష్టిని ఆకర్షించిన పల్నాడు రైతులు
యడ్లపాడు: ఆదాయం.. ఆరోగ్యంతో పర్యావరణాన్ని పరిరక్షించే ప్రకృతి వ్యవసాయ విధానం వైపు ప్రతి రైతు దృష్టి సారించాలని అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో సోమవారం పర్యటించింది. బృందం సభ్యులైన చంద్రశేఖర్ బ్రీడర్, సిద్ధార్థ సచ్‌దేవ్, వేదసుంకర, అనుశెట్టి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతుల పద్ధతులు, పంటల వైవిధ్యాన్ని పరిశీలించారు. రసాయన క్షేత్రాలకు, ప్రకృతి సాగు క్షేత్రాలకు వ్యత్యాసాల అధ్యయనంపై వీరు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులతో కలిసి బృందం మునగ తోట, దొండ పందిరి, సొర, కాకర, బీర వంటి అంతర పంటలు, కనకాంబరం, లిల్లీ పూల రకాల సాగును ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రకృతి సేద్యం విధానాలను చూసి మంత్ర ముగ్ధులయ్యారు. రైతులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించడం, అంతర పంటల ద్వారా ఒక ఎకరంలోనే ఐదు ఎకరాల పంట తీసుకోవడం వంటివి అద్భుతమని కొనియాడారు. ముందుగా గ్రామంలోని శివాలయం వద్ద ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమల కుమారి ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రాన్ని, ఇన్‌పుట్స్ తయారీ విధానాన్ని వివరించారు. విత్తన గుళికల తయారీ డెమోను చేసి చూపించారు. అనంతరం కొత్తపాలెంలోని శ్రీనివాస గ్రామైక్య సంఘంలో మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రకృతి సేద్యం రైతులు శ్రీకాంత్, భానుచంద్ర, పల్నాటి తిరుపతిరావు, బద్దేటి కోటేశ్వరమ్మ, మలమంటి గణేష్ తమ సేద్యం విధానం, నీటి యాజమాన్యం, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ గుంటూరు ఏడీఏ వాణిశ్రీ, యంగ్‌ప్రాజెక్ట్‌లీడ్ సౌమ్య, డీపీపీ భవానీరాజ్, నందకుమార్, వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, ఐలయ్య, శివయ్య, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.