
ఈ ఏడాదికి కొత్త బ్రిడ్జి లేనట్లేనా...!
ముప్పాళ్ల: సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిలో గుంటూరు బ్రాంచి కాలువపై శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాదికి లేనట్టే. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన నిర్మాణం పనులు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. సుమారు రూ.120 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం పనులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కాల్వలకు నీటి విడుదల ఆగిపోయిన తర్వాత మార్చి, ఏప్రిల్ నెలలో పనులు ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంది. అయినప్పటికీ రెండు నెలలు కాలం గడిపి తీరా కాల్వలకు నీటి విడుదల చేసే సమయంలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఆ మేర కాల్వలో దోనెలు ఏర్పాటు చేసి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. కాల్వలకు నీరు విడుదల చేయటంతో నిర్మించిన అప్రోచ్ రోడ్డును తొలగించారు. కాల్వలకు నీటిని నిలిపివేస్తే తప్ప పనులు ప్రారంభించడానికి వీలు లేదు. మరో ఏడాదిపాటు శిథిలావస్థకు చేరిన వంతెనపై రాకపోకలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది.