
సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలకు వేళాయె..!
సత్తెనపల్లి: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యాసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను గత ఏడాది నుంచి సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్‌మెంట్, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్’ ను ప్రవేశపెట్టారు. ఇదే విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 1–8 తరగతుల వరకు సీబీఏ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 పరీక్షలను జరపనున్నారు.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం...
ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈనెల 4 నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్‌మెంట్ బుక్‌లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈనెల 11 కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్ కు సంబంధించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్ తో పాటు, 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రాం పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అభ్యాసన లోపాలను గుర్తించడంతోపాటు, పక్కా బోధనతో వారిలో సామర్థ్యాలను వెలికి తీయడం సీబీఏ పరీక్షల ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్‌మెంట్–1,3, ఎస్‌ఏ 2కు ఫార్మేటివ్ బదులుగా సీబీఏ విధానంలో నిర్వహిస్తుండగా, ఎఫ్‌ఏ 2, 4, ఎస్‌ఏ 1 పాత విధానంలోనే నిర్వహించనున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్‌ఏలు, రెండు సమ్మెటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు.
నేటి నుంచి ఈ నెల 14 వరకు నిర్వహణ విద్యార్థి అభ్యసన మదింపునకు ప్రక్రియ డీసీఈబీ నుంచి మండలాలకు ప్రశ్నపత్రాలు
బైలింగ్విల్ ప్రశ్న పత్రాలు..
సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిషులో ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. ప్రశ్న పత్రంలోని 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాతపూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మెకానికల్ .. అండర్ స్టాండింగ్ .. అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది.