
రజక దివ్యాంగురాలిపై దాడి
పర్చూరు(చినగంజాం): దివ్యాంగురాలైన ఓ రజక యువతిపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై కారంచేడు ఎస్‌ఐ ఖాదర్ బాషా, బంధువులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. కారంచేడు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ యార్లగడ్డ శ్రీకృష్ణ, సుజాతలు నివాసముంటున్న అదే ప్రాంతంలో రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం నివాసముంటోంది. ఈనెల 8వ తేదీ ఉదయం సుజాత ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో ఆమెను చూసి నవ్వారనే సాకుతో రజక కుటుంబంతో వివాదానికి దిగారు. అంతేగాకుండా నగదు అప్పు తీసుకొని ఇవ్వలేదనే కోపంతో రజక కుటుంబానికి చెందిన కృష్ణకుమారి, కోటిరత్నం, సునీత, నాగేశ్వరరావులపై సుజాత ఆమె భర్త శ్రీకృష్ణలు దాడికి దిగారు. కర్రలతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచారు. అంతటితో ఆగక ఇనుపరాడ్లతో అదే కుంటుంబానికి చెందిన మూగ, చెవిటి యువతి పొదిలి దేవికపై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా కులం పేరుతో దూషించి అసభ్యంగా వ్యవహరించారు. ఆ సంఘటనలో దివ్యాంగురాలు స్పృహ కోల్పోగా చీరాల ఏరియా వైద్యశాలలో చేర్పించారు. ఆమెకు ఆస్పత్రిలో ఆక్సిజన్ అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని సమాచారం. ఆస్పత్రి వైద్యులు అందించిన నివేదిక మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దాంతోపాటు దాడికి పాల్పడిన శ్రీకృష్ణ కూడా రజక కుటుంబంపై ఫిర్యాదు చేయగా రెండు కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాదరబాషా తెలిపారు.
న్యాయం చేయాలి
రజక సామాజిక వర్గానికి చెందిన చెవిటి, మూగ యువతి పొదిలి దేవికపై అగ్రవర్ణాలకు చెందిన యార్లగడ్డ శ్రీకృష్ణ అతని భార్య దాడి చేసి గాయపరచిన సంఘటనకు సంబంధించి ప్రజాసంఘాలు, రజక వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. ఆదివారం రాత్రి చీరాల ఎన్‌జీ ఓ కార్యాలయంలో సమావేశమయ్యారు. రజక కుటుంబంపై దాడి చేసి మూగ, చెవిటి యువతి దేవికను రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచిన సంఘటనపై జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పెద్దిడపు కొండయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కంచర్ల చిట్టిబాబు, రాష్ట్ర చేనేత నేత మాచర్ల మోహనరావు, సీఐటీయూ నాయకులు పి.వసంతరావు, రజక కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.జనార్దన్, కొండవీటి శ్రీనివాసరావు, పొదిలి సూర్య పాల్గొన్నారు.
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు కలెక్టర్, ఎస్పీలను కలవనున్న ప్రజాసంఘాలు, రజక వర్కర్స్ అసోసియేషన్ నాయకులు

రజక దివ్యాంగురాలిపై దాడి