
మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దు
సత్తెనపల్లి: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు అన్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చదువుకుంటున్న తమ బిడ్డలు హాస్టళ్ళల్లో, రూముల్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తల్లి దండ్రు లు కాయా కష్టం చేసి డబ్బు పంపుతుంటే కొందరు యువత చెడు అలవాట్లకు బానిసలై అర్థంతరంగా తమ జీవితాలను ముగించుకుంటున్నారన్నారు. యువకులు బాగా చదువు కొని ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ కష్టాలను సైతం పక్కనపెట్టి ఖర్చు అయినప్పటికీ చదివిస్తున్నారన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటంతో యువత మాదక ద్రవ్యాలు, మద్యం, మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు యువతీ,యువకులు తప్పు దోవ పట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల్లో కూడా కొంత మార్పు రావాలని, బిడ్డల ముందు మద్యం తాగడం లాంటివి మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల జోలికి వెళ్ళబోమని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఐకమత్యంతో జరుపుకోవాలి...
ఈ నెల 27న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి గొడవలు లేకుండా ఐక్యమత్యంతో పండుగ నిర్వహించుకోవాలన్నారు. వినాయక విగ్రహలకు అనుమతులు తీసుకోవాలని, డీజేలు పెట్టడం, పార్టీ నాయకుల ఫ్లెక్సీలు, రెచ్చగొట్టే పాటలు వంటివి పెట్టి లేనిపోని గొడవలు సృష్టించవద్దన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్డెన్ సెర్చ్‌లో భాగంగా ఇంటింటికి తనిఖీలు చేపట్టి కాగితాలు సక్రమంగా లేని 37 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలతో పాటు 3 గొడ్డళ్లు, 2 బరిశలు స్వాధీన పరుచుకున్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, ఎంవి సుబ్బారావు, సురేష్, శ్రీనివాసరావు, సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ షేక్ అమినుద్దీన్, మరో నలుగురు ఎస్‌ఐలు, నలుగురు ట్రైనీ ఎస్‌ఐలు, 80 మంది పోలీసులు పాల్గొన్నారు.
గొడవలు లేకుండా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలి సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు లక్కరాజుగార్లపాడు గ్రామంలో కార్డెన్ సెర్చ్