
సంక్షేమ హాస్టళ్లలో నిరుపేద విద్యార్థులు ఉండి చదువుకుంటు
దాచేపల్లి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీస రక్షణ సౌకర్యాలు లేని హాస్టళ్లలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ వసతిగృహాలలో బయట వ్యక్తుల ప్రమేయాలు ఎక్కువ అయ్యాయి. వారు దందాలు చేస్తూ విద్యార్థులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఓ జూనియర్ విద్యార్థిపై బయట చదువుకుంటున్న ఓ సీనియర్ విద్యార్థి దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు కనీస రక్షణ సౌకర్యాలు లేవనే విషయం మరోసారి స్పష్టమైంది.
ప్రైవేటు వ్యక్తుల హల్‌చల్
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రైవేట్ వ్యక్తులు దందాలు సాగిస్తున్నారు. తమ వ్యక్తిగత కార్యకలాపాలతోపాటుగా అక్కడి విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. దాచేపల్లి బీసీ హాస్టల్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. హాస్టలుకు సంబంధం లేని ఓ విద్యార్థి తన వ్యక్తిగత విషయంపై మరో విద్యార్థిని అక్కడి తన స్నేహితుల వద్దకు పిలిచి చితకబాదాడు. హాస్టల్లో తన స్నేహితులు ఉండటం వల్ల వారి అండతో చితకబాది హత్య చేసేందుకు ప్రయత్నాలు చేయటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సదరు సీనియర్ విద్యార్థి ఇదే హాస్టల్లో ఉంటున్న ఎంతోమంది విద్యార్థులను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేసినట్లు కొందరు బాధితులు చెబుతున్నారు. అతడితోపాటు హాస్టల్లో ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ విద్యార్థులపైనా వార్డెనుకు ఫిర్యాదులు అందాయి. ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో వారి ఆగడాలు కొనసాగుతున్నాయి. దాచేపల్లితోపాటు ఇతర ప్రాంతాల్లోని హాస్టళ్లలో కూడా జూనియర్లకు, సీనియర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
తరచూ బయట వ్యక్తులు వచ్చి యథేచ్ఛగా దందాలు అడ్డగోలు వ్యవహారాలకు నిలయాలుగా మారిన వైనం తాజాగా దాచేపల్లి హాస్టల్ లో విద్యార్థిపై దుర్మార్గంగా దాడి హాస్టళ్లలో ఉండేందుకు భయపడుతున్న విద్యార్థులు
కనీస రక్షణ ఏర్పాట్లు లేని సంక్షేమ వసతి గృహాలు
వేధిస్తున్న సిబ్బంది కొరత
వసతి గృహాలలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో వీటి నిర్వహణ బాధ్యత కత్తి మీద సాములా మారింది. దాచేపల్లిలో రెండు హాస్టళ్లకు మాచర్లలో హాస్టల్ వార్డెన్‌గా ఉన్న వ్యక్తి ఇన్‌చార్జిగా ఉన్నారు. బాలుర వసతి గృహానికి కూడా సదరు మహిళా వార్డెనే ఇన్‌చార్జిగా ఉండటంతో విద్యార్థులపై నియంత్రణ కొరవడింది. ఇక్కడ బీటెక్, డిగ్రీ విద్యార్థులు కూడా ఉండటం వలన సీనియర్‌లకు చెప్పేందుకు మహిళా వార్డెన్ చొరవ తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల వార్డెన్, కుక్, కమాటి, వాచ్ మెన్‌లలో ఒకరుంటే ఒకరు లేరు. అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకుంటున్నా కొరత ఎక్కువగానే ఉంది. ఇకనైనా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంక్షేమ హాస్టళ్లలో నిరుపేద విద్యార్థులు ఉండి చదువుకుంటు