
ప్రజలకు అందుబాటులో ఆలూరి బైరాగి సమగ్ర సాహిత్యం
తెనాలి: మహాకవి ఆలూరి బైరాగి సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా మాజీ ఎంపీ, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. బైరాగి సాహిత్యాన్ని సమగ్ర సంకలనం తెస్తామని చెబుతూ, బైరాగి రచనలన్నింటినీ అంతర్జాలంలో చేర్చే బాధ్యతను తీసుకోవాలని తెనాలి రచయిత ముత్తేవి రవీంధ్రనాథ్‌ను కోరారు. హిందీ, తెలుగు సాహిత్య ధృవతార ఆలూరి బైరాగి శతజయంతి సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో బైరాగి కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన తెనాలి అయితానగర్‌లో ఏర్పాటు చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శనివారం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహదాత ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తానీరోజున ఈ స్థాయిలో ఉండటానికి కారణం బైరాగి అన్నారు. ఆయన రాసే కవిత్వం కోసం జనం అప్పట్లో ఎదురు చూశారని సోదాహరణంగా చెప్పారు. తెలుగు స్వతంత్ర పత్రిక ప్రతి సంచిక మొదటి పేజీలో బైరాగి కవితతోనే వచ్చిందన్నారు. తెలుగులో ఎంతగొప్ప కవిత్వాన్ని సృజించారో, హిందీలోనూ అంతే గొప్పగా కవిత్వం రచించిన ఏకై క కవి బైరాగిగా చెప్పారు. బైరాగి శత జయంతి సందర్భంగా సదస్సులు నిర్వహించి ఆయన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తన ప్రసంగంలో బైరాగి తెనాలిలో జన్మించడం గర్వకారణమన్నారు. ‘అరసం’జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెనాలి ప్రాంతం వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలకు కేంద్రమని చెప్పారు. ప్రపంచంలో ఇంత చిన్న పట్టణంలో వేలాది రచయితలు, కవులు, కళాకారులు ఉండటం అరుదైన అంశమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండ్ల మాధవరావు తన ప్రసంగంలో బైరాగి స్మారకంగా ఆయన సాహిత్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని సూచించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఇస్తున్న ఆలూరి బైరాగి అవార్డును ఇటీవల తనకు ప్రదానం చేయటం అదృష్టమన్నారు. మరో ప్రముఖ రచయిత వెన్నా వల్లభారావు మాట్లాడుతూ దివంగత ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా బైరాగి కవిత్వం విని, మెచ్చుకున్నవారేనని చెప్పారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ప్రముఖ రచయిత మత్తేవి రవీంధ్రనాథ్, గోళ్ల నారాయణరావు, ప్రజాసాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, డీఎల్ కాంతారావు, ఈదర శ్రీనివాసరావు, కనపర్తి బెన్‌హర్, రైతునేత ఈదర పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, తాడిబోయిన హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆలూరి బైరాగి శత జయంతి కమిటీ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పర్యవేక్షించారు.
అప్పుడే ఆ మహాకవికి నిజమైన నివాళి విగ్రహావిష్కరణలో ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్