
బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకటనర్సిరెడ్డి
నరసరావుపేట ఈస్ట్: రాజకీయ, సాహిత్య, గ్రంథాలయ రంగాలలో విశిష్ట సేవలు అందించిన యన్నం వెంకటనర్సిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పలువురు వక్తలు కొనియాడారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో శనివారం వెంకటనర్సిరెడ్డి సహస్ర చంద్రదర్శన మహోత్సవాన్ని నిర్వహించి అభినందన సంచికను విడుదల చేసారు. సంచికను కాసు కుటుంబ సభ్యులు డాక్టర్ కాసు ప్రసాదరెడ్డి, కాసు వెంకట రాజగోపాలరెడ్డి ఆవిష్కరించారు. అభినందన సభలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, సాహితీవేత్తలు డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ, మాశర్మ తదితరులు మాట్లాడుతూ, ఆయా రంగాలలో నర్సిరెడ్డి చేసిన కృషిని వివరించారు. గ్రంథాలయ ఉద్యమకారుడు అయ్యంకి వెంకట రమణయ్యతో కలసి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. గుంటూరు నగరం నడిబొడ్డున కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణం నర్సిరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేపట్టారని వివరించారు. ఎందరో సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలతో అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. ఉప్పలపాడు గ్రామ సర్పంచ్‌గా మూడున్నద దశాబ్దాలు పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, టుబాకో బోర్డు సభ్యునిగా, పీసీసీ సభ్యునిగా సేవలు అందించారని వివరించారు.