
ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్టు
సత్తెనపల్లి: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇరువురుని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు వివరాలను వెల్లడించారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారన్నారు. పార్కు రోడ్‌లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధ మహిళను కొట్టి గాయపరిచి ఆమె మెడలో రూ.3.42 లక్షలు విలువ చేసే 36.3 గ్రాముల బంగారు గొలుసు అపహరించి రెండు వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించడం జరిగిందన్నారు. పలు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా చైన్‌స్నాచింగ్ చేసే దొంగలను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి పూర్తి బంగారం రికవరీ చేశామని, రెండు మొబైల్ ఫోన్లు, హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ స్వాధీన పరుచుకున్నామన్నారు. ఇరువురిని కోర్టుకు హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. మరొకడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి త్వరితగతిన కేసు ఛేదించిన పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్, ఇతర పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు లు అందించటం జరుగుతుందన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వర రావు, పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.