
జెడ్పీ హైస్కూల్‌ను దత్తత తీసుకున్న కలెక్టర్
నరసరావుపేట రూరల్: శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు దత్తత తీసుకున్నారు. కలెక్టరేట్ సమీపంలోని లింగంగుంట్ల శంకరభారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం కలెక్టర్ అరుణ్‌బాబు సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులు అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తానని, ప్రతి నెలా చదువులో వెనకబడిన విద్యార్థుల ప్రమాణాలను పరిశీలిస్తానని తెలిపారు. సిలబస్ పూర్తి చేయడం మీద కంటే విద్యార్థులకు పాఠాలు అర్ధమయ్యేలా బోధించడం ముఖ్యమని తెలిపారు. వారంలో రెండు సార్లు డిప్యూటి డీఈవో పాఠశాలను సందర్శించి బోధనా పద్ధతులను సమీక్ష చేయాలని ఆదేశించారు.