
బీసీలపై పథకం ప్రకారమే టీడీపీ దాడులు
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో బీసీలపై టీడీపీ శ్రేణులు పథకం ప్రకారమే దాడులు చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ విభాగ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. కూటమి నాయకులు తీరు మార్చుకోకపోతే బీసీల తిరుగుబాటును చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలను రాజకీయంగా లొంగదీసుకోవాలి, లేదంటే అణచివేయాలనే కుట్రతో దాడులు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. బీసీ మహిళలను సైతం వేధిస్తున్నారని, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడి ఇందుకు నిదర్శనమని తెలిపారు. మాజీ మంత్రి విడదల రజినిపై సైతం టీడీపీ నాయకులు ట్రోలింగ్ చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌పై అక్రమ కేసులు పెట్టి ఎనిమిది నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో భయానక వాతావరణం కల్పించి బూత్‌ల ఆక్రమణకు పాల్పడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలే కారణమని తెలిపారు. వారిని హత్య చేసేందుకు దాడిలో పలువురు మారణాయుధాలతో పాల్గొన్నారని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోవు ఎన్నికల్లో బీసీల ప్రతాపాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం బదులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ బీసీలకు చేసేందేమిలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుచేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో బీసీ విభాగ జిల్లా అధ్యక్షుడు సిడ్డారపు గాంధీ, వైఎస్సార్‌సీపీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యదర్శి ఈఎం స్వామి, ఇంగ్గిష్ మీడియం విద్యా పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్టినేటర్ దాదినబోయిన ఏడుకొండలు, బీసీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజవరపు శివనాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నరసరావుపేట వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ, బీసీ విభాగం నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, పిడుగురాళ్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు శెట్టిపల్లి పూర్ణ, బీసీ సంఘ నాయకులు బాలు, చల్లా కాశీబాబు, అబ్దుల్ కలాం ఆశయ సాధన కమిటీ అద్యక్షుడు కాపర్తి మహమ్మద్‌నూర్‌లు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ విభాగం నేతలు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడికి ఖండన బీసీలను అణగదొక్కే దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం కుట్రలని మండిపాటు